నెమ్మదించనున్న ట్రాక్టర్ల అమ్మకాలు : మాగ్మా

12 Sep, 2014 01:55 IST|Sakshi

 హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశవ్యాప్తంగా గతేడాది ట్రాక్టర్ల అమ్మకాల్లో 20 శాతం వృద్ధి నమోదయ్యిందని, అది ఈ ఏడాది 5 శాతానికి పరిమితం అవుతుందని అంచనా వేస్తున్నట్లు ఎన్‌బీఎఫ్‌సీ మాగ్మా ఫిన్‌కార్ప్ పేర్కొంది. ఎలినెనో, వర్షాలు ఆలస్యంగా కురవడం కారణంగా ఖరీప్ పంటలు దెబ్బతిన్నాయని, దీంతో రెండో అర్ధ భాగం నుంచి అమ్మకాలు తగ్గుతాయని అంచనా వేస్తున్నట్లు మాగ్మా ఫిన్‌కార్ప్ ట్రాక్టర్ల అమ్మక విభాగ అధిపతి ధృబషీష్ భట్టాచార్య తెలిపారు.

 గతేడాది రబీ పంటలు బాగుండటంతో ఈ ఏడాది తొలి త్రైమాసిక అమ్మకాలు బాగున్నాయని, కాని రెండో అర్థభాగం నుంచి అమ్మకాలు తగ్గొచ్చని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నట్లు పేర్కొన్నారు. గురువారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో భట్టాచార్య మాట్లాడుతూ దేశవ్యాప్తంగా ట్రాక్టర్ల అమ్మకాలు తగ్గినా, మాగ్మా ఫిన్‌కార్ప్ ట్రాక్టర్ల రుణాల్లో 30 శాతం వృద్ధిని నమోదు చేస్తుందన్న ధీమాను వ్యక్తం చేశారు.

 తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ల్లో గతేడాది రూ.562  కోట్ల రుణాలను ఇచ్చామని, ఈ ఏడాది వ్యాపారంలో 20 శాతం వృద్ధి నమోదవుతుందని అంచనా వేస్తున్నట్లు తెలిపారు. దేశవ్యాప్తంగా వ్యాపారంలో 25 శాతం వృద్ధిని ఆశిస్తున్నట్లు ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. రూ. 500 కోట్ల నిధుల సమీకరణకు బోర్డు అనుమతించిందని, అవసరమైనప్పుడు ఈ నిధులను సమీకరిస్తామన్నారు. తెలంగాణాలో 12, ఆంధ్రాలో 12 శాఖలు ఉన్నాయని, ప్రస్తుతానికి ఈ రెండు రాష్ట్రాల్లో శాఖల సంఖ్యను పెంచే ఆలోచన లేదన్నారు.

మరిన్ని వార్తలు