మా నాన్న బయోమెట్రిక్‌ వివరాలు ఇచ్చేయండి

16 Mar, 2018 09:29 IST|Sakshi

న్యూఢిల్లీ : ఇప్పటికే ప్రభుత్వం సేకరిస్తున్న బయోమెట్రిక్‌ వివరాలపై పలు వాదనలు వినపడుతుండగా.. తాజాగా ఓ అరుదైన కేసు ఉన్నత న్యాయస్థానం ముందుకు వచ్చింది. అదేమిటంటే.. చనిపోయిన మా నాన్న బయోమెట్రిక్‌ వివరాలు యూఐడీఏఐ వెనక్కి ఇచ్చేయాలంటూ బెంగళూరుకు చెందిన ఓ మానవ వనరుల అధికారి సుప్రీంకోర్టును ఆశ్రయించడం. ఆధార్‌ కార్డు కోసం తన తండ్రి దగ్గర్నుంచి సేకరించిన బయోమెట్రిక్‌ వివరాలను, యూఐడీఏఐ వెనక్కి ఇచ్చేయాలంటూ సంతోష​ మిన్‌ బి అనే వ్యక్తి కోరుతున్నాడు. తన తండ్రి చనిపోయినందున యూఐడీఏఐకి ఈ డేటాతో ఎలాంటి అవసరం ఉండదని, ఒకవేళ ఆ వివరాలు యూఐడీఏఐ వద్దనే ఉంటే, వాటిని దుర్వినియోగపరిచే అవకాశాలున్నాయంటూ ఈ వ్యక్తి సుప్రీంకోర్టులో పిటిషన్‌ వేశాడు. 

చీఫ్‌ జస్టిస్‌ దీపక్‌ మిశ్రా ఆధ్వర్యంలోని ఐదుగురు జడ్జీల రాజ్యాంగ బెంచ్‌ ఈ పిటిషన్‌ను విచారించింది. తన కేసు తరుఫున వాదనలు వినిపించడానికి ఫిర్యాదుదారునికి రెండు నిమిషాల సమయం కేటాయించింది.  ఈ సమయంలో ఆధార్‌ స్కీమ్‌ ఒక అప్రకటిత ఎమర్జెన్సీగా అతను అభివర్ణించాడు. ప్రింటెడ్‌ ఫామ్‌లో తమ తండ్రి బయోమెట్రిక్‌ వివరాలను యూఐడీఏఐ తనకు సమర్పించేలా కోర్టు ఆదేశించాలని అతను కోరాడు. వీటిని తన భావితరాల కోసం భద్రంగా ఉంచనున్నట్టు పేర్కొన్నాడు. అదేవిధంగా ఆధార్‌ స్కీమ్‌ను రద్దు చేయాలని కూడా కోరాడు. 2016 డిసెంబర్‌ 31న తన తండ్రి చనిపోయాడని, తమ చరిత్రలో అది చీకటి రోజని, అదే రోజు డిమానిటైజేషన్‌ ప్ర​క్రియ కూడా ముగిసిందంటూ చెప్పుకొచ్చాడు. 

తనకు కేటాయించిన రెండు నిమిషాల సమయంలో ఈ ప్రసంగాన్ని ప్రారంభించిన అతనిని మధ్యలోనే ఆపివేసిన బెంచ్‌... ఇక్కడ ప్రసంగాలు ఇవ్వడానికి అనుమతి లేదని హెచ్చరించింది. ఈ కేసు తదుపరి విచారణను బెంచ్‌ మార్చి 20కి వాయిదా వేసింది. కాగ,  ఆధార్ అనుసంధానానికి గతంలో విధించిన మార్చి 31 గడువును పొడిగిస్తున్నట్టు రెండు రోజుల క్రితమే సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. ఈ కేసుపై విచారణ జరుపుతున్న రాజ్యాంగ ధర్మాసనం తుది తీర్పు ఇచ్చే వరకూ అనుసంధానం తప్పనిసరి కాదని తెలిపింది. ఆధార్ చట్టబద్ధతను నిర్ధారించే వరకూ బ్యాంకింగ్, మొబైల్ సేవలు సహా పలు సేవలకు ఆధార్‌ను అనుసంధానించటం తప్పనిసరి కాదని ధర్మాసనం పేర్కొంది.

మరిన్ని వార్తలు