ఫేస్‌బుక్ చీఫ్ జుకర్‌బర్గ్ సంపద డబుల్

3 Mar, 2014 02:19 IST|Sakshi
ఫేస్‌బుక్ చీఫ్ జుకర్‌బర్గ్ సంపద డబుల్

 న్యూయార్క్: సోషల్ నెట్‌వర్కింగ్ దిగ్గజం ఫేస్‌బుక్ దూకుడులాగే ఆ కంపెనీ సీఈఓ, సహ వ్యవస్థాపకుడు మార్క్ జుకర్‌బర్గ్(29 ఏళ్లు) సంపద కూడా దూసుకుపోతోంది. రెండేళ్ల కంటే తక్కువ వ్యవధిలోనే ఆయన సంపద దాదాపు రెట్టింపు స్థాయిలో ఎగబాకింది. దీనంతటికీ ఫేస్‌బుక్ షేరు ధర పరుగే కారణం. 2012 మే 18న ఫేస్‌బుక్ పబ్లిక్ ఇష్యూ సమయంలో జుకర్ బర్గ్ సంపద(కంపెనీలో ఆయనకున్న వాటా ప్రకారం) 18 బిలియన్ డాలర్లు మాత్రమే.

ఇప్పుడిది ఏకంగా 33 బిలియన్ డాలర్లకు ఎగసింది. అంటే 15 బిలియన్ డాలర్ల సంపద జతైంది. నాస్‌డాక్‌లో లిస్టింగ్ సమయంలో ఫేస్‌బుక్ షేరు ధర 38 డాలర్లు కాగా, ఈ ఏడాది ఫిబ్రవరి 28 నాటికి ఇది 80 శాతం వృద్ధితో 68.46 డాలర్లకు చేరింది. తాజా గణాంకాల ప్రకారం జుకర్‌బర్గ్ వద్ద 47.89 కోట్ల షేర్లు ఉన్నాయి. కంపెనీలో ఆయన వాటా 19.6%. 2004 ఫిబ్రవరిలో ఆరంభమైన ఫేస్‌బుక్ సంస్థ గత నెలలోనే పదేళ్లు పూర్తి చేసుకుంది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఫేస్‌బుక్‌ను వినియోగిస్తున్న యూజర్ల సంఖ్య 123 కోట్లు పైనే. మొబైల్ చాటింగ్ అప్లికేషన్ సేవల దిగ్గజం వాట్స్‌యాప్‌ను ఏకంగా 19 బిలియన్ డాలర్లు(రూ.1.18 లక్షల కోట్లు) వెచ్చించి కొనుగోలు చేస్తున్నట్లు ఫేస్‌బుక్  ఇటీవలే ప్రకటించడం తెలిసిందే.

మరిన్ని వార్తలు