మరోసారి మారుతి అమ్మకాలు ఢమాల్‌!  

1 Oct, 2019 11:53 IST|Sakshi

సెప్టెంబరులో 24 శాతం కుదేలైన అమ్మకాలు

సాక్షి,ముంబై:  దేశంలో అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి ఇండియా (ఎంఎస్‌ఐ)  అమ్మకాల్లో ఈ నెలలో కూడా కుదేలైంది. తాజా గణాంకాల ప్రకారం అమ్మకాలలో 24.4 శాతం క్షీణించింది.  సెప్టెంబర్‌లో 1,22,640 యూనిట్ల అమ్మకాలను  మాత్రమే నమోదు చేసింది. గత ఏడాది సెప్టెంబర్‌లో కంపెనీ 1,62,290 యూనిట్లను విక్రయించింది. వార్షిక ప్రాతిపదికన ఎగుమతులు  కూడా క్షీణించాయని ఎంఎస్‌ఐ ఒక ప్రకటనలో తెలిపింది.

గత నెలలో దేశీయ అమ్మకాలు 26.7 శాతం క్షీణించి 1,12,500 యూనిట్లుగా ఉండగా,  గత ఏడాది (2018, సెప్టెంబర్‌లో) 1,53,550 యూనిట్లుగా నమోదయ్యాయి. ఆల్టో, వాగన్ఆర్లతో కూడిన మినీ కార్ల అమ్మకాలు 20,085 యూనిట్లుగా ఉండగా, గత ఏడాది ఇదే నెలలో 34,971 యూనిట్లు, 42.6 శాతం తగ్గాయి. కాంపాక్ట్ సెగ్మెంట్ అమ్మకాలు, స్విఫ్ట్, సెలెరియో, ఇగ్నిస్, బాలెనో మరియు డిజైర్ వంటి మోడల్స్ 22.7 శాతం క్షీణించి 57,179 యూనిట్లకు చేరుకున్నాయి. గత ఏడాది సెప్టెంబర్‌లో 74,011 కార్లు ఉన్నాయి. మిడ్-సైజ్ సెడాన్ సియాజ్ అంతకుముందు 6,246 యూనిట్లతో పోలిస్తే 1,715 యూనిట్లను విక్రయించింది.

అదేవిధంగా, విటారా బ్రెజ్జా, ఎస్-క్రాస్,  ఎర్టిగాతో సహా యుటిలిటీ వాహనాల అమ్మకాలు 21,526 యూనిట్ల వద్ద స్వల్పంగా తగ్గాయి. అంతకుముందు ఏడాది  ఇవి  21,639 గా ఉంది. సెప్టెంబరులో ఎగుమతులు 17.8 శాతం తగ్గి 7,188 యూనిట్లుగా ఉండగా, గత ఏడాది ఇదే నెలలో 8,740 యూనిట్లు నమోదయ్యాయి. దీంతో పండుగ  సీజన్‌లో నేపథ్యంలో ఆగస్టు మాసంతో పోలిస్తే  సెప్టెంబరులో విక్రయాలు పెరుగుతాయనే ఆటో కంపెనీల  ఆశలపై తాజా లెక్కలు నీళ్లు చల్లాయి. 

మరిన్ని వార్తలు