మైక్రోసాఫ్ట్ లాభం 10 శాతం డౌన్

28 Jan, 2015 00:45 IST|Sakshi
మైక్రోసాఫ్ట్ లాభం 10 శాతం డౌన్

విండోస్‌కు ఆదరణ తగ్గటమే కారణం!
షేరు ధర కూడా ఒకేరోజు 10% పతనం

సియాటిల్: క్లౌడ్ కంప్యూటింగ్ వ్యాపారం పుంజుకుంటున్నప్పటికీ.. విండోస్ విక్రయాలు మందగిస్తుండటం ఐటీ దిగ్గజం మైక్రోసాఫ్ట్ లాభాలపై ప్రతికూల ప్రభావం చూపుతోంది. తాజాగా డిసెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో కంపెనీ లాభం దాదాపు 10 శాతం క్షీణించి 5.86 బిలియన్ డాలర్లకు తగ్గింది.

క్రితం ఆర్థిక సంవత్సరం ఇదే వ్యవధిలో సంస్థ లాభం 6.56 బిలియన్ డాలర్లు. కరెన్సీ మారకం విలువ భారీ హెచ్చుతగ్గులకు లోను కావడం కూడా లాభాల తగ్గుదలకు మరో కారణమని కంపెనీ వర్గాలు తెలిపాయి. పర్సనల్ కంప్యూటర్స్ అమ్మకాలు తగ్గుతున్న ప్రభావం .. విండోస్ సాఫ్ట్‌వేర్ విక్రయాలపై కూడా పడుతున్న సంగతి తెలిసిందే. అటు కంపెనీ ఆదాయం మాత్రం 8 శాతం పెరిగి 26.47 బిలియన్ డాలర్లుగా నమోదైంది.

* నోకియా కంపెనీ హ్యాండ్‌సెట్స్ వ్యాపారాన్ని మైక్రోసాఫ్ట్ గతేడాది కొనుగోలు చేయడం ఆదాయం పెరుగుదలకు కొంత దోహదపడింది.  కంపెనీ ఆదాయం 26.3 బిలియన్ డాలర్ల మేర ఉండగలదని పరిశ్రమవర్గాలు అంచనా వేశాయి.
* మరోవైపు, తాజా నిరుత్సాహకర ఫలితాల నేపథ్యంలో మైక్రోసాఫ్ట్ షేరు ఏకంగా 10 శాతం మేర పతనమై 42.30 డాలర్ల దగ్గర ట్రేడయ్యింది. ఒకే రోజులో మార్కెట్ క్యాప్ దాదాపు 35 బిలియన్ డాలర్లు (సుమారు రూ. 2,17,000 కోట్లు) ఆవిరైపోయింది. 348.67 బిలియన్ డాలర్లకు తగ్గింది.

>
మరిన్ని వార్తలు