మీ లక్ష్యాలకు గన్ షాట్‌

29 Jul, 2019 11:59 IST|Sakshi

మిరే అస్సెట్‌ ఎమర్జింగ్‌ బ్లూచిప్‌ ఫండ్‌

దీర్ఘకాల లక్ష్యాలకు తగినంత నిధిని సమకూర్చుకోవాలనుకునే ప్రతి ఒక్కరు తమ పోర్ట్‌ఫోలియో కోసం పరిశీలించాల్సిన వాటిల్లో మిరే అస్సెట్‌ ఎమర్జింగ్‌ బ్లూచిప్‌ ఫండ్‌ ఒకటి. లార్జ్‌క్యాప్‌లో స్థిరత్వం, మిడ్‌క్యాప్‌లో దూకుడైన రాబడులు రెండూ ఈ పథకంలో భాగం. ఎందుకంటే మిడ్‌క్యాప్, లార్జ్‌క్యాప్‌ స్టాక్స్‌ మిశ్రమంగా ఈ పథకం పోర్ట్‌ఫోలియో ఉంటుంది. మల్టీక్యాప్‌ ఫండ్స్‌ విభాగంలో ఈ పథకం మంచి ఎంపిక అవుతుంది. 

రాబడులు
ఈ పథకం ఆరంభమైనప్పటి నుంచి అన్ని కాలాల్లోనూ రాబడుల విషయంలో మెరుగైన పనితీరును నిరూపించుకుంది. ఏడాది కాలంలో 10.2 శాతం, మూడేళ్లలో వార్షికంగా 18.6 శాతం, ఐదేళ్లలో 21 శాతం వార్షిక ప్రతిఫలాన్నిచ్చింది. ఇదే కాలంలో ఈ పథకం పనితీరుకు ప్రామాణికంగా చూసే ‘నిఫ్టీ లార్జ్‌ మిడ్‌క్యాప్‌ 250టీఆర్‌ఐ’ రాబడులు ఏడాది, మూడేళ్లు, ఐదేళ్లలో వరుసగా 2 శాతం, 14.5 శాతం, 12.8 శాతంగానే ఉండడం గమనార్హం. బెంచ్‌ మార్క్‌తో చూసుకుంటే 4–6 శాతం అధిక రాబడులు అందించింది. అంతేకాదు ఇదే విభాగంలోని కెనరా రొబెకో ఎమర్జింగ్‌ ఈక్విటీస్, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌ లార్జ్‌ అండ్‌ మిడ్‌క్యాప్, ఎల్‌అండ్‌టీ లార్జ్‌ అండ్‌ మిడ్‌క్యాప్‌ పథకాల కంటే పనితీరు పరంగా ముందుండడం గమనార్హం. అన్ని కాలాల్లోనూ లార్జ్‌ అండ్‌ మిడ్‌క్యాప్‌ విభాగంలో చక్కని రాబడుల చరిత్ర కలిగిన పథకం ఇది.

పెట్టుబడుల విధానం
లార్జ్‌క్యాప్, మిడ్‌క్యాప్‌నకు 35–65 శాతం మధ్య కేటాయింపులు చేస్తుంది. నగదు నిల్వలను ఎక్కువగా ఉంచుకోకుండా, పెట్టుబడులను దాదాపుగా ఈక్విటీల్లో ఇన్వెస్ట్‌ చేస్తుంటుంది. ప్రస్తుతానికి 99.52 శాతం ఈక్విటీల్లో ఇన్వెస్ట్‌ చేసి ఉండగా, పెట్టుబడుల్లో కేవలం 0.48 శాతమే నగదు రూపంలో కలిగి ఉంది. ప్రస్తుతం 50.5 శాతం వరకు లార్జ్‌క్యాప్‌లో ఇన్వెస్ట్‌ చేయగా, మరో 43 శాతం పెట్టుబడులను మిడ్‌క్యాప్‌ స్టాక్స్‌లో, 6.43 శాతం మేర స్మాల్‌క్యాప్‌ స్టాక్స్‌లో పెట్టుబడులు పెట్టి ఉంది. ఈ పథకం పోర్ట్‌ఫోలియోలో 61 స్టాక్స్‌ ఉన్నాయి. ఇందులో టాప్‌ 10 స్టాక్స్‌లోనే 37.63 శాతం మేర ఇన్వెస్ట్‌ చేసింది. బ్యాంకింగ్, ఫైనాన్షియల్‌ రంగ కంపెనీలపై ఎక్కువ వెయిటేజీ కలిగి ఉంది. ఈ రంగ స్టాక్స్‌లో 33 శాతం వరకు ఇన్వెస్ట్‌ చేయగా, ఆ తర్వాత హెల్త్‌కేర్‌లో 12.59 శాతం, ఇంధన రంగ స్టాక్స్‌లో 8 శాతానికి పైగా పెట్టుబడులు పెట్టింది. ముఖ్యంగా గత ఏడాదిన్నర కాలంలో మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్‌ స్టాక్స్‌ తీవ్ర అస్థిరతలు, దిద్దుబాటుకు గురికావడాన్ని చూశాం. గత ఏడాది కాలంలో లార్జ్‌క్యాప్‌ సూచీ 7 శాతం లాభపడితే, మిడ్‌క్యాప్‌ సూచీ 4 శాతం పడిపోయింది. ఇటువంటి పరిస్థితుల్లోనూ ఈ పథకం గడిచిన ఏడాది కాలంలో 10 శాతం మేర రాబడులు అందించిందంటే దీని పనితీరుకు ఇదే నిదర్శనం. 2011, 2018 మార్కెట్‌ కరెక్షన్లలో నష్టాలను పరిమితం చేయడాన్ని కూడా పరిశీలించొచ్చు.

మరిన్ని వార్తలు