దేశ వ్యాప్తంగా ముత్తూట్ ఫైనాన్స్ ఏటీఎంలు

4 Jun, 2014 00:48 IST|Sakshi

సాక్షి ప్రతినిధి, బెంగళూరు : బంగారం తనఖా వ్యాపార రంగంలోని ముత్తూట్ ఫైనాన్స్ లిమిటెడ్ వచ్చే మూడేళ్లలో దేశ వ్యాప్తంగా ఆరు వేల ఏటీఎంలను ఏర్పాటు చేస్తున్నట్లు ఆ సంస్థ డెరైక్టర్ జార్జ్ ఎం. అలెగ్జాండర్ వెల్లడించారు. బెంగళూరులోని లింగరాజపురంలో తొలి ఏటీఎంను మంగళవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికం అంతానికి దేశ వ్యాప్తంగా వంద ఏటీఎంలను నెలకొల్పనున్నట్లు చెప్పారు.

మరో ఏడాదిలో వెయ్యి, రెండేళ్లలో రెండు వేల ఏటీఎంలను ఏర్పాటు చేస్తామని తెలిపారు. తొలుత తమ బ్రాంచి కార్యాలయాల్లోనే ఏటీఎంలను నెలకొల్పుతామని, తదుపరి ఆఫ్ సైట్ ఏటీఎంల గురించి ఆలోచిస్తామని వివరించారు. తమ ఏటీఎంలలో నగదు తీసుకోవడం, నిల్వ వాకబులతో పాటు ఖాతా నుంచి ఖాతాకు బదిలీ, పిన్ చేంజ్, కార్డ్‌లెస్ విత్‌డ్రా, కార్డ్ టు కార్డ్ బదిలీ లాంటి సేవలను అందుబాటులోకి తీసుకొస్తామని వివరించారు. వీటితో పాటు ఎంపిక చేసిన ప్రాంతాల్లో ఏటీఎం సదుపాయంతో కూడిన ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేసి, నగదు బదిలీ, విదేశ ద్రవ్య మార్పిడి, ఎయిర్ టికెటింగ్, బిల్లుల చెల్లింపులు లాంటి సదుపాయాలు కల్పిస్తామని వెల్లడించారు. 65 శాతం ఏటీఎంలను సెమీ-అర్బన్, గ్రామీణ ప్రాంతాల్లో ఏర్పాటు చేస్తామన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో వీడియో ఇంటర్‌యాక్టివ్ సదుపాయం, టీవీ స్క్రీన్‌లను నెలకొల్పడం ద్వారా ఈ ఏటీఎంలను వాడకందార్ల నేస్తాలుగా రూపొందిస్తామని తెలిపారు.

మరిన్ని వార్తలు