ప్రేమ కాదు.. పగ అనేది బలమైన భావోద్వేగం

26 Nov, 2023 04:16 IST|Sakshi

దర్శకుడు సందీప్‌రెడ్డి వంగా

‘‘ప్రేమ, కోపం కాదు..పగ తీర్చుకోవడమే బలమైన భావోద్వేగమని ‘యానిమల్‌’ సినిమా ప్రయాణంలో నాకు అనిపించింది. మనతో పగను ముందుకు తీసుకువెళ్లడం అనేది చిన్న విషయం కాదు. నేను ఎందుకు ఇలా చెబుతున్నానో ‘యానిమల్‌’ సినిమా చూస్తే ప్రేక్షకులు అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను’’ అన్నారు దర్శకుడు సందీప్‌రెడ్డి వంగా. రణ్‌బీర్‌ కపూర్, రష్మికా మందన్నా హీరో హీరోయిన్లుగా, అనిల్‌ కపూర్, బాబీ డియోల్‌ కీలక పాత్రల్లో నటించిన చిత్రం ‘యానిమల్‌’. తెలుగు, తమిళం, కన్నడం,మలయాళం, హిందీ భాషల్లో ఈ చిత్రం డిసెంబరు 1న విడుదల కానుంది. ఈ సందర్భంగా సందీప్‌రెడ్డి వంగా చెప్పిన విశేషాలు...

► తండ్రీకొడుకుల భావోద్వేగమే ‘యానిమల్‌’ సినిమా ప్రధానాంశం. ఓ వ్యక్తి తన భావోద్వేగంతో కుటుంబం కోసం ఎంతదూరం వెళ్లాడు? అన్నదే ఈ సినిమా. ఈ సినిమాలో హింసాత్మక సన్నివేశాలను, భావోద్వేగ సన్నివేశాలను బ్యాలెన్స్ చేశాననే అనుకుంటున్నాను.

► ‘యానిమల్‌’ కథను తొలిసారిగా విన్నప్పుడు కొంతమంది యాక్టర్స్‌కు కొన్ని అంశాలు నచ్చలేదనే చర్చ జరిగి 
ఉండొచ్చు. అయితే ‘యానిమల్‌’ కథ రణ్‌బీర్‌ కపూర్‌కు నచ్చింది. పైగా నాకు బాగా నచ్చిన నటుడు. గొప్ప వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి రణ్‌బీర్‌ 
కపూర్‌.

► ఈ సినిమా లవ్‌స్టోరీతోనే మొదలవుతుంది. ఈ సినిమాలో హీరో పాత్రను అతని తల్లిదండ్రులు కన్నా ఎక్కువగా అర్థం చేసుకున్నది హీరోయిన్  పాత్రే అని సినిమా చూసినప్పుడు ప్రేక్షకులకు అనిపిస్తుంది. కథలో రష్మికా మందన్నా, అనిల్‌కపూర్‌ పాత్రలు చాలా కీలకంగా ఉంటాయి. బాబీ డియోల్‌ది విలన్  రోల్‌. ఆయన పాత్ర గురించి నేను ఇప్పుడే చెప్పలేను. ప్రేక్షకులు థియేటర్స్‌లో చూడాలి. నిర్మాత భూషణ్‌కుమార్‌గారు ఫుల్‌ ఫ్రీడమ్‌ ఇచ్చారు. నా సొంత సోదరుడు ప్రణయ్‌ ్రపోడక్షన్ లో ఉండటం నాకు ప్లస్‌గానే అనిపించింది. నా సినిమా నాకంటే ఎక్కువగా మరొకరికి అర్థం కాదేమోనని నా సినిమాలకు నేనే ఎడిటింగ్‌ చేసుకుంటున్నాను. అలా ‘యానిమల్‌’ సినిమాకు ఎడిటింగ్‌ చేశాను. 

► అన్నివర్గాల ప్రేక్షకులకు నచ్చేలా సినిమా అంటే స్టోరీ, క్యారెక్టర్స్‌లో ఇంటెన్స్ తగ్గిపోవచ్చు. సినిమాకు ‘ఏ’ సర్టిఫికేట్‌ వచ్చింది. ఇది చిన్నపాటి మైనస్‌ అనుకుంటున్నాను. అయితే ‘యానిమల్‌’ నిడివి మూడుగంటల ఇరవై నిమిషాలు ఉండటం అనేది పెద్ద సమస్య కాదని నేను అనుకుంటున్నాను. ఓ అమ్మాయి, అబ్బాయి ప్రేమకథలా వచ్చిన ‘అర్జున్  రెడ్డి’ సినిమా మూడుగంటల ఆరు నిమిషాలైనా ప్రేక్షకులు ఆదరించారు. ‘యానిమల్‌’ సినిమాలో ప్రేమకథే కాదు.. కుటుంబ అంశాలను ప్రస్తావించాము. కాబట్టి నిడివి కాస్త ఎక్కువైంది. ‘అర్జున్ రెడ్డి’ కంటే కేవలం ఓ పది నిమిషాలు ఎక్కువ అంతే. ప్రేక్షకులకు ‘యానిమల్‌’ కూడా 
నచ్చుతుందనే నమ్మకం ఉంది.

► ఇండస్ట్రీపై ‘శివ’ సినిమా చూపించినంత ప్రభావం ‘అర్జున్ రెడ్డి’ సినిమా కూడా చూపించిందంటే నేను ఒప్పుకోలేను. ‘శివ’ సినిమా టైమ్‌లెస్‌ క్లాసిక్‌. ‘అర్జున్ రెడ్డి’ చిత్రం ఎంత క్లాసిక్‌ అనేది టైమ్‌ చెబుతుంది.

► ఓ దర్శకుడిగా నాకు అందరి హీరోలతో సినిమాలు చేయాలని ఉంది. ‘అర్జున్ రెడ్డి’ తర్వాత మహేశ్‌బాబుగారికి ఓ స్టోరీలైన్  చెప్పాను. రామ్‌చరణ్‌కు ఓ కథ చెప్పాను. వారు బిజీగా ఉండటం వల్ల కుదర్లేదు. అయితే ప్రభాస్‌గారితో నా తర్వాతి సినిమా ‘స్పిరిట్‌’ ఉంటుంది. వచ్చే ఏడాది సెప్టెంబరులో షూటింగ్‌ స్టార్ట్‌ చేసే ఆలోచనలో ఉన్నాం. అల్లు అర్జున్ గారితో ఓ కమిట్‌మెంట్‌ ఉంది.    
                           ∙ 

మరిన్ని వార్తలు