బిగ్ డేటాలో నాస్కామ్ శిక్షణ కేంద్రం

26 Jun, 2015 00:36 IST|Sakshi
బిగ్ డేటాలో నాస్కామ్ శిక్షణ కేంద్రం

 హైదరాబాద్, బిజినెస్ బ్యూరో : బిగ్ డేటా, బిజినెస్ అనలిటిక్స్ రంగంలో అపార అవకాశాల నేపథ్యంలో భారత వృత్తి నిపుణులకు శిక్షణ ఇచ్చేందుకు సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (సీవోఈ) ఏర్పాటుకు నేషనల్ అసోసియేషన్ ఆఫ్ సాఫ్ట్‌వేర్ అండ్ సర్వీసెస్ కంపెనీస్ (నాస్కామ్) రెడీ అవుతోంది. కేంద్ర ప్రభుత్వ సహకారంతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే ఇది సాకారం కానుందని నాస్కామ్ చైర్మన్ బీవీఆర్ మోహన్‌రెడ్డి తెలిపారు. బిగ్ డేటా, అనలిటిక్స్‌పై గురువారమిక్కడ ప్రారంభమైన నాస్కామ్ రెండు రోజుల సదస్సు సందర్భంగా మీడియాతో మాట్లాడారు.

‘ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంలో ఈ కేంద్రాన్ని అభివృద్ధి చేస్తాం. అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో బోధన ఉంటుంది. బిజినెస్ అనలిటిక్స్ రంగంలో దేశంలో 50 వేల మంది నిపుణులు ఉన్నారు. నిపుణుల సంఖ్య వచ్చే ఐదేళ్లపాటు ఏటా 20 శాతం వృద్ధి చెందుతుంది. 2020 నాటికి అంతర్జాతీయ మార్కెట్ కోసం భారత్ నుంచి 400 సొల్యూషన్స్ వచ్చే అవకాశం ఉంది’ అని చెప్పారు. డేటా అనలిటిక్స్ రంగంలో నిపుణులకు డిమాండ్ చాలా ఉంది. ఒక్క యూఎస్‌లోనే 1.40 లక్షల మంది నిపుణులు అవసరమని మోహన్ రెడ్డి పేర్కొన్నారు.

 స్టార్టప్‌లతో మార్కెట్ జోష్..
 దేశంలో అనలిటిక్స్ రంగంలో 370 స్టార్టప్ కంపెనీలు నిమగ్నమయ్యాయని నాస్కామ్ వైస్ ప్రెసిడెంట్ కేఎస్ విశ్వనాథన్ తెలిపారు. రూ.9,450 కోట్ల విలువైన అనలిటిక్స్ పరిశ్రమ ఈ కంపెనీలతో వేగంగా వృద్ధి చెందుతోందని చెప్పారు. హెచ్1బీ వీసాల విషయంలో అమెరికా చట్టాలను భారత కంపెనీలు ఉల్లంఘిస్తున్నాయన్న వార్తలపై మోహన్‌రెడ్డి స్పందిస్తూ.. అక్కడి చట్టాలకు లోబడే కంపెనీలు వ్యవహరిస్తున్నాయని స్పష్టం చేశారు. కొత్త ఉద్యోగావకాశాలు పుట్టుకొస్తున్న ఈ నేపథ్యంలో ప్రపంచమంతా తూర్పు దేశాలవైపే చూస్తోందన్న విషయాన్ని నాస్కామ్ సైతం విశ్వసిస్తోందని అన్నారు. భారత్‌లో అపార అవకాశాలు ఉన్నాయని గుర్తు చేశారు.

మరిన్ని వార్తలు