దేశీయ సహజవాయువు ధర 10 శాతం పెంపు

29 Sep, 2018 00:59 IST|Sakshi

న్యూఢిల్లీ: దేశీయంగా ఉత్పత్తి అయ్యే సహజవాయువు ధరను 10 శాతం పెంచుతున్నట్టు కేంద్ర ప్రభుత్వం శుక్రవారం ప్రకటించింది. దీంతో గ్యాస్‌ ఆధారిత విద్యుత్, ఎరువుల తయారీ వ్యయాలు పెరిగి అంతిమంగా ధరల పెరుగుదలకు దారితీయనుంది. మిలియన్‌ బ్రిటిష్‌ థర్మల్‌ యూనిట్‌ గ్యాస్‌ ధరను అక్టోబర్‌ 1 నుంచి 3.36 డాలర్లకు పెంచింది. ఇది ఆరు నెలల పాటు అమల్లో ఉంటుంది.

ప్రస్తుతం ఇది 3.06 డాలర్లుగా ఉంది. అమెరికా, రష్యా, కెనడా దేశాల్లో సగటు ధరను ఆధారంగా చేసుకుని ప్రతీ ఆరు నెలలకు ప్రభుత్వం దేశీయంగా ధరలను నిర్ణయిస్తుంటుంది. మన దేశ గ్యాస్‌ అవసరాల్లో సగం మేర దిగుమతి చేసుకుంటున్నాం. దీని ధర దేశీయ గ్యాస్‌ ధర కంటే రెట్టింపు ఉంటోంది. ధరల పెంపుతో ఓఎన్‌జీసీ, రిలయన్స్‌ ఆదాయాలు పెరగనున్నాయి. క్లిష్టమైన ప్రాంతాల్లో ఉత్పత్తయ్యే గ్యాస్‌ ధరను సైతం మిలియన్‌ బ్రిటిష్‌ థర్మల్‌ యూనిట్‌కు 6.78 డాలర్ల నుంచి 7.67 డాలర్లు చేసింది.

మరిన్ని వార్తలు