విమానాశ్రయాల్లో బయోమెట్రిక్‌ తనిఖీ

24 Dec, 2016 00:30 IST|Sakshi
విమానాశ్రయాల్లో బయోమెట్రిక్‌ తనిఖీ

హైదరాబాద్‌ ఎయిర్‌పోర్టులో ఇప్పటికే పైలట్‌ ప్రాజెక్టు; త్వరలో దేశవ్యాప్తం!

న్యూఢిల్లీ: దేశీయ విమానాశ్రయాల్లో బయోమెట్రిక్‌ భద్రతా తనిఖీ వ్యవస్థ త్వరలో కార్యరూపం దాల్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రయోగాత్మకంగా హైదరాబాద్‌లోని అంతర్జాతీయ విమానాశ్రయంలో ఏర్పాటు చేసిన ఈ విధానం పట్ల సానుకూల స్పందన రావడంతో మిగిలిన విమానాశ్రయాల్లోనూ దీన్ని అమల్లోకి తేవాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ విషయమై కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి అశోక్‌గజపతి రాజు శుక్రవారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. విమానాశ్రయాల్లో ప్రయాణికుల వివరాల తనిఖీకి బయోమెట్రిక్‌ వ్యవస్థ ఉండడం ఓ మంచి ఆలోచనగా ఆయన పేర్కొన్నారు.

‘‘హైదరాబాద్‌ ఎయిర్‌పోర్టులో బయోమెట్రిక్‌ సౌకర్యం ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టాం. మంచి స్పందన వచ్చింది. భద్రతాపరంగా బయోమెట్రిక్‌ వ్యవస్థ మంచి ఆలోచన’’ అని రాజు వివరించారు. ఈ విధానాన్ని దేశవ్యాప్తంగా అమలు చేయబోతున్నారా? అన్న ప్రశ్నకు ఆయన స్పందిస్తూ... దీనిపై కార్యాచరణ రూపొందించాలని అధికారులను కోరినట్టు పేర్కొన్నారు. ఆధునికీకరణ అనేది నిరంతర ప్రక్రియ అని... భద్రత విషయంలో రాజీపడే ప్రసక్తే లేదన్నారు. ప్రయాణికులు అవాంతరాల్లేకుండా వచ్చి పోయేందుకు వీలుగా ‘నాన్‌ స్టాంపింగ్‌ బ్యాగేజ్‌ ట్యాగ్‌’ విధానాన్ని ముంబై, హైదరాబాద్, బెంగళూరు, కోల్‌కతా విమానాశ్రయాల్లో ప్రవేశపెట్టగా... క్రమంగా ఇతర విమానాశ్రయాలకు దీన్ని విస్తరించనున్నట్టు అశోక్‌గజపతి రాజు తెలిపారు.

మరిన్ని వార్తలు