ప్రీమియంల చెల్లింపులకు ‘ఈ’ దారి రహదారి..

8 Jun, 2014 00:14 IST|Sakshi
ప్రీమియంల చెల్లింపులకు ‘ఈ’ దారి రహదారి..

 కృష్ణకు కూతురంటే ఎంతో ఇష్టం. ఆమె ఉన్నత విద్యకు చైల్డ్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకున్నాడు. మూడు నెలలకు ఒకసారి ప్రీమియం చెల్లిస్తున్నాడు.  పాలసీ మురిగిపోకుండా సమయానికి ప్రీమియం చెల్లించడం ఆయన పద్ధతి. అయితే ఇందుకు భిన్నంగా జరిగిపోయింది. రెండు ప్రీమియంలు వరుసగా చెల్లించలేకపోయాడు. మార్కెటింగ్ ఉద్యోగంలో పలు ప్రాంతాలు తిరగాల్సిరావడం దీనితో సంబంధిత కార్యాలయానికి వెళ్లి ప్రీమియం చెల్లించడానికి తగిన సమయం అందుబాటులో లేకపోవడమే దీనికి కారణం.
 
ఫలితం పాలసీ మురిగిపోయే పరిస్థితి ఏర్పడింది. తిరిగి పునరుద్ధరించుకోడానికి కొంత సమయం, ప్రయాస తప్పదు. కృష్ణకే కాదు.  చాలా మందికి ఇలాంటి పరిస్థితి ఎదురయ్యే ఉంటుంది. అయితే  ఇలాంటి వారికందరికీ  ఎలక్ట్రానిక్ క్లియరింగ్ సర్వీస్ (ఈసీఎస్) చక్కని మార్గం. ఆటోమేటిక్ ప్రీమియం చెల్లింపులకు సులభమైన పద్ధతి. ఇక బిజీ కస్టమర్లకు ఈసీఎస్ ఎంతో సౌకర్యవంతం.
 
ఈసీఎస్ అంటే ఏమిటి?

ఒక బ్యాంక్ అకౌంట్ నుంచి మరొక అకౌంట్‌కు ఆటోమేటిక్‌గా డబ్బు బదలాయింపునకు ఉద్దేశించినదే ఈసీఎస్. బీమా ప్రీమియంల నుంచి మరే ఇతర బిల్లు చార్జీల చెల్లింపులైనా క్రమబద్ధంగా జరపడానికి ఇది చక్కని మార్గం. ఉదాహరణకు నిర్ణీతకాలంలో క్రమానుగుణంగా ప్రీమియం సొమ్ము చెల్లింపునకు వీలుగా మీ బ్యాంక్ అకౌంట్‌కు పాలసీ నంబర్‌కు అనుసంధానం చేయడం, దీనివల్ల ఎటువంటి ఇబ్బందీ లేకుండా సంబంధిత మొత్తం గడువుతేదీనాటికి  మీ ప్రీమియం కింద జమవుతుంది.
 
ఈ అనుసంధానం తరువాత,  డిఫాల్ట్, ల్యాప్స్... వంటి పదాలకే అవకాశం ఉండదు. వ్యక్తిగత శ్రమా తప్పుతుంది.  డబ్బుకూ భరోసా ఉంటుంది. ఈ విధానంలో పాలసీ హోల్డర్ అకౌంట్, పాలసీ వివరాలు సైతం రహస్యంగానే ఉండడం మరో ప్రత్యేకత. పైగా ఈ సౌకర్యం వినియోగించుకున్నందుకు అటు బ్యాంక్ గానీ, ఇటు బీమా కంపెనీగానీ మీపై ఎటువంటి అదనపు చార్జీల భారం విధించబోవు. బ్యాంక్, బీమా వంటి సంస్థలకు కూడా ఈ విధానం విస్తరణ వల్ల వ్యయ, నిర్వహణా పరమైన ఇబ్బందులు చాలా వరకూ తగ్గిపోతాయి.
 
ప్రారంభం ఎలా..!
ఈసీఎస్ సౌలభ్యం పొందడానికి తొలుత మీరు పాలసీ కడుతున్న బీమా సంస్థ ద్వారాగానీ లేక మీ అకౌంట్ ఉన్న బ్యాంక్ ద్వారాకానీ ఆన్‌లైన్‌లో రిజిస్టర్ కావాల్సి ఉంటుంది. లేదా స్వయంగా ఆయా సంస్థల నిర్దేశిత దరఖాస్తులను పూర్తిచేసి సమర్పించినా తదుపరి ఆన్‌లైన్ అనుసంధాన వ్యవస్థ అందుబాటులోకి వస్తుంది. ఆయా సందర్భాల్లో కొన్ని సంస్థలు ఒక కేన్సిలేషన్ చెక్‌ను కూడా కోరుతున్నాయి.
 
డబ్బు జమకు సంబంధించిన వివరాలు సైతం మీ మొబైల్‌కు లేదా మీ ఈ మెయిల్‌కు వచ్చే వ్యవస్థ ఇప్పుడు అందుబాటులో ఉంది. పట్టణ స్థాయి నుంచి నగరస్థాయి వరకూ దాదాపు ఇప్పుడు కస్టమర్లు అందరికీ ఈసీఎస్ మార్గం అందుబాటులోకి వచ్చేసింది.  చివరిగా చెప్పేదేమిటంటే... మీ బ్యాంక్ అకౌంట్‌లో ‘చెల్లింపులకు తగిన డబ్బు’ ఎప్పటికప్పుడు అందుబాటులో ఉంచాలన్న విషయం మీరు సదా గుర్తుంచుకోవాలి.

మరిన్ని వార్తలు