ఇషా అంబానీ రైట్‌ హ్యాండ్‌ ఇతడే.. జీతం లక్షల్లో కాదు కోట్లల్లోనే..

24 Nov, 2023 15:04 IST|Sakshi

Reliance First Employee: భారతదేశంలో అత్యంత సంపన్నుడు, రిలయన్స్ కంపెనీ అధినేత ముఖేష్ అంబానీ, ఆయన కుటుంబం గురించి మాత్రమే అందరికి తెలుసు. కానీ ఆ సంస్థ ఈ రోజు ఈ స్థాయిలో ఉండటానికి దోహదపడిన చాలా మంది సన్నిహితుల గురించి బహుశా తెలియకపోవచ్చు. ఈ కథనంలో రిలయన్స్ బ్రాండ్ లిమిటెడ్ మొదటి ఉద్యోగి ఎవరు? ప్రస్తుతం ఆయన జీతం ఎంత? అనే మరిన్ని ఆసక్తికర విషయాలు చూసేద్దాం..

'దర్శన్ మెహతా' (Darshan Mehta).. ఈ పేరు చాలామందికి తెలియకపోవచ్చు, కానీ రిలయన్స్ బ్రాండ్ లిమిటెడ్ (RBL) మొదటి ఉద్యోగి ఇతడే అంటే చాలా మంది ఆశ్చర్యపోవచ్చు, ఆ సంస్థ ఉన్నతికి పాటుపడిన కొంతమంది వ్యక్తులలో ఈయన ఒకరు కావడం గమనార్హం. మెహతా ప్రస్తుతం RBL ప్రెసిడెంట్, మేనేజింగ్ డైరెక్టర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 

2007లో ముఖేష్ అంబానీ స్థాపించిన రిలయన్స్ బ్రాండ్ లిమిటెడ్ మొదటి ఉద్యోగి అయిన దర్శన్ మెహతా 'చార్టర్డ్ అకౌంటెంట్'. చదువు పూర్తయిన తరువాత త్రికాయా గ్రే అడ్వర్టైజింగ్‌ (Trikaya Grey Advertising)లో సీనియర్ ఎగ్జిక్యూటివ్‌గా అడ్వర్టైజింగ్‌లో కెరీర్ ప్రారంభించాడు. భారతదేశానికి టామీ హిల్‌ఫిగర్, గాంట్ మరియు నౌటికా వంటి స్పోర్ట్స్‌వేర్ బ్రాండ్‌లను తీసుకురావడంలో ఈయన కీలక పాత్ర పోషించినట్లు తెలుస్తోంది.

దర్శన్ మెహతా జీతం
ప్రతిరోజూ కొత్త శిఖరాలను తాకుతున్న కంపెనీని నిర్వహించడం అంత సులభం కాదు. కంపెనీ కోసం కీలక నిర్ణయాలు తీసుకునే దర్శన్ మెహతా.. ఇషా అంబానీకి సన్నిహిత సహాయకుడు, రైట్ హ్యాండ్ కూడా. 2020-2021లో ఈయన వార్షిక వేతనం రూ. 4.89 కోట్లు అని తెలుస్తోంది.

ఇదీ చదవండి: చిన్న గదిలో మొదలైన వ్యాపారం.. నేడు రూ.4000 కోట్ల సామ్రాజ్యంగా..!!

రిలయన్స్ బ్రాండ్ లిమిటెడ్
2007లో ప్రారంభమైన రిలయన్స్ బ్రాండ్ లిమిటెడ్ అంబానీ కుమార్తె 'ఇషా అంబానీ' నేతృత్వంలో ఉంది. 125 బిలియన్ డాలర్ల మార్కెట్ క్యాప్ కలిగిన ఈ సంస్థ జిమ్మీ చూ, ఎర్మెనెగిల్డో జెగ్నా, బొట్టెగా వెనెటా, జార్జియో అర్మానీ, బర్బెర్రీ, సాల్వటోర్ ఫెర్రాగామో వంటి సుమారు 50 కంటే ఎక్కువ ప్రముఖ బ్రాండ్‌లతో కలిసి పనిచేసింది. ఈ కంపెనీ ఇప్పటికి వేలసంఖ్యలో రిటైల్ అండ్ ఆన్‌లైన్‌ స్టోర్లను కలిగి ఉంది. 2022 డిసెంబర్ 31తో ముగిసిన త్రైమాసికంలో RBL ఏకంగా రూ. 67,634 కోట్ల అమ్మకాలను పొందినట్లు సమాచారం.

మరిన్ని వార్తలు