కొత్త హెచ్‌1బీ ప్రతిపాదనలతో అనిశ్చితి: నాస్కామ్‌

3 Dec, 2018 11:15 IST|Sakshi

న్యూఢిల్లీ: హెచ్‌1బీ వీసాల కోసం కంపెనీలు ముందుగానే ఎలక్ట్రానిక్‌ రూపంలో నమోదు చేసుకోవాలనే అమెరికా నూతన ప్రతిపాదనతో అనిశ్చితి పెరుగుతుందని, అక్కడి ఉద్యోగాలకు ముప్పు ఏర్పడుతుందని సాఫ్ట్‌వేర్‌ కంపెనీల సమాఖ్య ‘నాస్కామ్‌’ ఆందోళన వ్యక్తం చేసింది. హెచ్‌1బీ వీసాలకు సంబంధించిన 139 పేజీల ప్రతిపాదనను పూర్తిగా అధ్యయనం చేసి వాటి ప్రభావం అమెరికా కంపెనీలు, ఆర్థిక వ్యవస్థపై చూపే ప్రభావాన్ని తమ అభిప్రాయాల రూపంలో తెలియజేస్తామని ప్రకటించింది.

ట్రంప్‌ సర్కారు హెచ్‌1బీ వీసాల్లో భారీ మార్పులను ప్రతిపాదించిన విషయం తెలిసిందే.  దీనిపై జనవరి 2 వరకు అభిప్రాయాలను స్వీకరిస్తామని అమెరికా అంతర్గత భద్రత విభాగం తన ప్రకటనలో తెలిపింది.‘‘కొత్త ప్రతిపాదనతో అంతర్జాతీయ ఐటీ కంపెనీలు అమెరికాలో తమ నైపుణ్య సేవలను అందించడం మరింత భారం అవుతుంది. వాటిపై ఆధారపడిన అమెరికా కంపెనీలను బలహీనపరుస్తుంది. అమెరికా ఉద్యోగాలకు ముప్పు ఏర్పడుతుంది. ఐటీ సేవలను మరింతగా విదేశాలకు అవుట్‌సోర్స్‌ చేయడానికి దారితీస్తుంది’’ అని నాస్కామ్‌ పేర్కొంది.

మరిన్ని వార్తలు