`8,000 దిగువకు నిఫ్టీ

12 Jun, 2015 01:36 IST|Sakshi
8,000 దిగువకు నిఫ్టీ

వర్షాభావ భయాలతో మార్కెట్ కుదేల్
470 పాయింట్ల నష్టంతో 26,371కు సెన్సెక్స్ 
నిఫ్టీకి 159 మైనస్...

సాధారణం కంటే తక్కువగానే వర్షాలు కురుస్తాయన్న ఆందోళనలు గురువారం స్టాక్‌మార్కెట్‌పై పిడుగులు కురిపించాయి. దీనికి తోడు రుణ వృద్ధి మందగమనంగా ఉండటంతో స్టాక్ మార్కెట్ భారీగా పతనమైంది. బీఎస్‌ఈ సెన్సెక్స్ 470 పాయింట్లు పతనం కాగా, నిఫ్టీ 8,000 పాయింట్ల దిగువకు వచ్చేసింది. కరంట్ అకౌంట్ లోటు తగ్గడం, సానుకూలంగా ఉన్న అంతర్జాతీయ సంకేతాలు.

వీటిని వేటినీ ఇన్వెస్టర్లు పట్టించుకోలేదు.శుక్రవారం విడుదల కానున్న ఏప్రిల్ నెల పారిశ్రామికోత్పత్తి, మే నెల వినియోగదారుల ద్రవ్యోల్బణ గణాంకాలపై దృష్టిపెట్టిన ట్రేడర్లు తమ పొజిషన్లను తగ్గించుకుంటున్నారని విశ్లేషకులంటున్నారు.  మొత్తం మీద సెన్సెక్స్ 470 పాయింట్లు నష్టపోయి 26,371 పాయింట్ల వద్ద, నిఫ్టీ 159 పాయింట్లు నష్టపోయి 7,965 పాయింట్ల వద్ద ముగిశాయి. సెన్సెక్స్‌కు గత ఏడాది అక్టోబర్  తర్వాత ఇదే అత్యంత కనిష్ట స్థాయి. బ్యాంక్, ఆర్థిక సేవలు, వాహన, విద్యుత్ రంగ కంపెనీల షేర్లు బాగా నష్టపోయాయి. అన్ని రంగాల సూచీలు నష్టాలపాలయ్యాయి.

బ్యాంక్ షేర్లు బేర్ ...
ప్రభుత్వ రంగ బ్యాంకులకు బడ్జెట్‌లో కేటాయించినదాని కంటే మరిన్ని పెట్టుబడులు కావాలంటూ ఆర్‌బీఐ ఆర్థిక మంత్రిత్వ శాఖకు లేఖ రాయడంతో బ్యాంక్ షేర్లు కుదేలయ్యాయి. ఆర్థికమంత్రి జైట్లీ శుక్రవారం పీఎస్ బ్యాంకు చీఫ్‌లతో భేటీ కానున్నారు. 30 సెన్సెక్స్ షేర్లలో 29కి నష్టాలే: వేదాంతా మినహా  30 సెన్సెక్స్ షేర్లలో 29 షేర్లూ నష్టాల్లోనే ముగిశాయి. టర్నోవర్ బీఎస్‌ఈలో రూ.2,508 కోట్లు. ఎన్‌ఎస్‌ఈ నగదు విభాగంలో రూ.15,406 కోట్లు. డెరివేటివ్స్ విభాగంలో రూ.2,80,050 కోట్లుగా నమోదైంది.

నిఫ్టీ టార్గెట్‌ను సవరించిన యూబీఎస్
ఈ ఏడాది చివరికల్లా నిఫ్టీ టార్గెట్‌ను స్విట్జర్లాండ్ బ్రోకరేజ్ సంస్థ యూబీఎస్ సవరించింది. ఈ టార్గెట్‌ను గత 9,200 నుంచి వర్షాభావ అంచనాల వల్ల  ప్రస్తుతం 8,600కు తగ్గిస్తున్నామని తెలిపింది.
 

మూడు నెలల్లో 12 శాతం పతనం
సెన్సెక్స్ లాభాల్లోనే ప్రారంభమైంది. ఆ తర్వాత 27,000 పాయింట్ల గరిష్ట స్థాయిని తాకింది. లాభాల స్వీకరణ కారణంగా 26,349 పాయింట్ల కనిష్ట స్థాయికి పడిపోయింది. చివరకు 470 పాయింట్లు(1.75 శాతం) నష్టంతో 26,371 పాయింట్ల వద్ద ముగిసింది. 7,958-8,163 పాయింట్ల కనిష్ట, గరిష్ట స్థాయిల మధ్య కదలాడిన నిఫ్టీ చివరకు 159 పాయింట్ల (1.96 శాతం)నష్టంతో 7,965 పాయింట్ల వద్ద ముగి సింది. ఈ ఏడాది మార్చి 4న సెన్సెక్స్ 30,025, నిఫ్టీ 9,119 పాయింట్ల జీవిత కాల గరిష్ట స్థాయిలను తాకాయి. అప్పటి నుంచి చూస్తే కేవలం మూడు నెలల్లో సెన్సెక్స్ 12.2 శాతం, నిఫ్టీ 12.7 శాతం చొప్పున పతనమయ్యాయి.

మరిన్ని వార్తలు