అందుబాటుకే ఆదరణ

10 Mar, 2017 23:25 IST|Sakshi
అందుబాటుకే ఆదరణ

సాక్షి, హైదరాబాద్‌: ఆధునిక సదుపాయాలు లేకపోయినా ఫర్వాలేదు. ఆట స్థలాలకు స్థానం కల్పించకున్నా ఇబ్బంది లేదు. ధర అందుబాటులో ఉంటే చాలు. ఇంటి విస్తీర్ణం తక్కువైనా.. నిర్మాణం నాణ్యంగా ఉంటే కొనడానికి సిద్ధంగా ఉన్నామని కొనుగోలుదారులు అంటున్నారు. సామాన్య, మధ్యతరగతి ప్రజలను దృష్టిలో పెట్టుకొని అందుబాటు ప్రాజెక్ట్‌లను నిర్మించాలని కోరుతున్నారు.

మన దేశంలోని నగరాలు, పట్టణాల్లో సుమారు 3 కోట్ల దాకా ఇళ్లు అవసరమవుతాయని సర్వేలు చెబుతున్నాయి. దీంతో బడా డెవలపర్లు పునరాలోచనలో పడ్డారు. దిగ్గజాలైన నిర్మాణ సంస్థలు ఆర్థిక మాంద్యం దెబ్బతో నీరసపడ్డాయి. ప్రవాస భారతీయులు, ఐటీ నిపుణులు అనుకున్నంత స్థాయిలో కొనుగోళ్లు జరపకపోవటమే ఇందుకు కారణం. దీంతో తక్కువ విస్తీర్ణం ఇళ్లకు శ్రీకారం చుట్టాయి.

ఇప్పటిదాకా భారత స్థిరాస్తి సంస్థలు బ్యాంకులకు కోట్ల రూపాయలు బకాయిలు పడ్డాయి. కొంతమంది వద్ద యాభై శాతం ఫ్లాట్లు కూడా అమ్ముడుపోలేదు. అమ్మకాల్లేక కుంగిపోవటం కంటే అందుబాటు ఇళ్లను నిర్మిస్తే నగదు లభ్యతకు ఇబ్బంది ఉండదనేవారు లేకపోలేదు. ఇందుకోసం పలు సంస్థలు సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తున్నాయి.

నగరానికి చెందిన పలు నిర్మాణ సంస్థలు అందుబాటు ధరల్లో ఇళ్లను నిర్మించడం మొదలుపెట్టాయి. విస్తీర్ణం తక్కువ గల ఫ్లాట్లను నిర్మించడానికి ప్రజయ్, జనప్రియ సంస్థలు ముందుకొచ్చాయి. కూకట్‌పల్లి, మియాపూర్, చందానగర్‌ వంటి ప్రాంతాల్లో రూ.25 లక్షల్లోపు ఫ్లాట్లు కొనేవారు బోలెడుమంది ఉన్నారు. కానీ, ఈ తరహా నిర్మాణాలు చేపట్టేవారి సంఖ్య తక్కువ.

హైదరాబాద్‌ నిర్మాణ రంగం ఐటీ నిపుణుల మీదే ఎక్కువగా ఆధారపడి ఉంది. మాంద్యం కనుమరుగు కావటంతో ఐటీ నిపుణులు అధికంగా కొనుగోళ్లు చేస్తున్నారు. ఇందుకు పలు కారణాలున్నాయి. వీరికి స్థానిక అంశంతో సంబంధం లేదు. పైగా పుణె, బెంగళూరు, చెన్నై వంటి నగరాలతో పోల్చితే హైదరాబాద్‌లో రేట్లు తక్కువగా ఉండటం. పెట్టుబడి కోణంలో ఆలోచించేవారు, స్థిర నివాసం ఏర్పాటు చేసుకోవాలనుకునే వారు నగరం వైపు దృష్టిసారిస్తున్నారు.

మరిన్ని వార్తలు