విమాన ప్రయాణం.. డిజిటల్‌ మయం!!

29 Apr, 2017 00:39 IST|Sakshi
విమాన ప్రయాణం.. డిజిటల్‌ మయం!!

న్యూఢిల్లీ: మొబైల్‌ హ్యాండ్‌సెట్, ఆధార్‌ ఉంటే చాలు ఇక విమానయానాన్ని సులభంగా చేసేయెచ్చు. మరి టికెట్‌ అవసరం లేదా? అని మీకు డౌట్‌ రావొచ్చు. టికెట్‌ తప్పనిసరి. అయితే ఫోన్, ఆధార్‌ సాయంతో ఎయిర్‌ ట్రావెల్‌ను డిజిటలైజ్‌ చేయాలని కేంద్రం భావిస్తోంది. అంటే ఇక్కడ కాగితంతో పనిలేదు. అన్నీ డిజిటల్‌ అన్నమాట. ఎయిర్‌పోర్ట్‌ ఎంట్రీ, టికెట్‌ వంటివన్నీ డిజిటలైజ్‌ అవుతాయి. కేంద్ర పౌరవిమానయాన శాఖ ‘డిజి యాత్ర’ కార్యక్రమంలో భాగంగా బోర్డింగ్‌ పాస్, సెక్యూరిటీ ఇంటరాక్షన్స్‌ను డిజిటల్‌ చేయాలని ప్రయత్నిస్తోంది.

 పూర్తి విమాన ప్రయాణాన్ని డిజిటలైజ్‌ చేయడానికి ప్రయత్నిస్తున్నామని పౌరవిమానయాన శాఖ సహాయ మంత్రి జయంత్‌ సిన్హా తెలిపారు. ‘ప్రయాణికుల పేమెంట్స్, బోర్డింగ్, సెక్యూరిటీ ఇంటరాక్షన్స్‌ అన్నీ కూడా డిజటల్‌మయం అవుతాయి. కాగితంతో ఎలాంటి అవసరం ఉండదని, ప్రయాణికులను అధికారులు ఆధార్, పాస్‌పోర్ట్‌ తదితరాల ద్వారా గుర్తిస్తారని తెలిపారు. కొన్ని నెలల్లో అనుకున్నవన్నీ కార్యరూపం దాలుస్తాయని చెప్పారు.

 సీఐఐ నిర్వహించిన ఒక కార్యక్రమంలో సిన్హా మాట్లాడారు. నో–ఫ్లై లిస్ట్‌ను కూడా తీసుకువచ్చే ఆలోచనలో ఉందన్నారు. అంటే ఎవరైనా వికృత చేష్టలకు పాల్పడటం, అతిగా ప్రవర్తించడం వంటివి చేస్తే.. విమానంలోని ఇతర ప్రయాణికులు భద్రతను దృష్టిలో ఉంచుకొని ఇలాంటి వారి ప్రయణాన్ని రద్దు చేస్తారు. వారి పేర్లను ఈ నో–ఫ్లై జాబితాలో ఉంచుతారు.

మరిన్ని వార్తలు