Blue Aadhaar Card: బ్లూ ఆధార్ ఎందుకో తెలుసా? పూర్తి వివరాలు..

21 Oct, 2023 18:09 IST|Sakshi

దేశంలో ఆధార్‌ కార్డుకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. ప్రభుత్వ కార్యాలయాలు, బ్యాంకులు, సంక్షేమ పథకాలు, సబ్సిడీలు ఇలా ఎక్కడ పని జరగాలన్నా ఆధార్‌ తప్పనిసరైంది. అందుకే దీన్ని అత్యంత ముఖ్యమైన గుర్తింపు కార్డుగా పరిగణిస్తారు. పూర్తి పేరు, శాశ్వత చిరునామా, పుట్టిన తేదీ వంటి ప్రాథమిక సమాచారమంతా 12 అంకెల సంఖ్యకు అనుసంధానించి ‘భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (యూఐడీఏఐ)’ ఆధార్‌ కార్డును జారీ చేస్తోంది. 

ఆధార్‌ కార్డులు సాధారణంగా తెలుపురంగులో ఉండడం గమనించే ఉంటాం. ఇవి వయోజనుల కోసం జారీ చేసే కార్డులు. కానీ, యూఐడీఏఐ పిల్లల కోసం ప్రత్యేకంగా నీలం రంగులో ఉండే ఆధార్‌ కార్డుల (బ్లూ ఆధార్‌)ను జారీ చేస్తోంది. వీటిని బాల ఆధార్‌ కార్డుగా వ్యవహరిస్తున్నారు. ఇవి 5 ఏళ్లలోపు పిల్లల కోసం జారీ చేస్తారు. వీరికి వేలిముద్రలు, కంటిపాప వంటి బయోమెట్రిక్‌ వివరాలు సేకరించకుండానే కార్డు అందజేస్తారు. అన్ని వివరాలు వెరిఫై చేసిన తర్వాత 60 రోజులలోపు బ్లూ ఆధార్ కార్డ్ జారీ అవుతుంది. కేవలం ఫొటో, పేరు, చిరునామా, తల్లిదండ్రుల పేరు వంటి ప్రాథమిక సమాచారం అందులో ఉంటుంది. ఈ కార్డుని తల్లిదండ్రుల ఆధార్‌తో అనుసంధానిస్తారు. 

బాల ఆధార్‌ కార్డు కాలపరమితి పిల్లల వయసు ఐదేళ్లు వచ్చే వరకే. తర్వాత వేలి ముద్రలు, కంటిపాప వంటి వివరాలను అందజేసి ఆధార్‌కార్డుని అప్‌డేట్‌ చేసుకోవాల్సి ఉంటుంది. లేదంటే, కార్డు చెల్లదు. 15 ఏళ్లు నిండిన తర్వాత వేలిముద్రలు, కంటిపాప వివరాలతో మరోసారి ఆధార్‌ కార్డుని అప్‌డేట్‌ చేసుకోవాలి.

నవజాత శిశువుల కోసం తల్లిదండ్రులు బాల్‌ ఆధార్‌కు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. జనన ధ్రువీకరణ పత్రం లేదా ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయిన పత్రం వంటి డాక్యుమెంట్లు అందజేస్తే సరిపోతుంది. లేదా పిల్లల పాఠశాల ఐడెంటిటీ కార్డుని కూడా ఉపయోగించుకోవచ్చు.

ఉపయోగాలివీ..

  • బ్లూ ఆధార్ కార్డును పిల్లలకు గుర్తింపు రుజువుగా వినియోగించవచ్చు. 
  • దీని సహాయంతో పిల్లలు అర్హత కలిగిన ప్రభుత్వ సబ్సిడీ పథకాలను పొందవచ్చు. 
  • పిల్లలకు మధ్యాహ్న భోజన స్కీమ్ పొందటానికి వీలవుతుంది.
  • నకిలీ విద్యార్థుల వివరాలను గుర్తించేందుకు ప్రభుత్వం ఈ వివరాలను వినియోగించుకుంటుంది. 
  • అడ్మిషన్ ప్రక్రియ కోసం తల్లిదండ్రులు బ్లూ ఆధార్ కార్డులను అందించాలని అనేక పాఠశాలలు పట్టుబడుతున్నాయి.
     
మరిన్ని వార్తలు