ద్రవ్య లభ్యత సమస్యల్లేవు! 

8 Jan, 2019 01:04 IST|Sakshi

అవసరమైతే తగిన చర్యలు తీసుకుంటాం

ఇష్టానుసారం రైతు రుణ మాఫీలు సరికాదు

ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంతదాస్‌ స్పష్టీకరణ

చిన్న, లఘు, మధ్యతరహా ప్రతినిధులతో సమావేశం

నేడు ఎన్‌బీఎఫ్‌సీ  అధికారులతో భేటీ  

న్యూఢిల్లీ: ఆర్థిక వ్యవస్థలో ప్రస్తుతం ద్రవ్య లభ్యత (లిక్విడిటీ) సమస్యలు లేవని రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) గవర్నర్‌ శక్తికాంతదాస్‌ ఉద్ఘాటించారు. అవసరమైతే తగిన అన్ని చర్యలూ తీసుకుంటామని స్పష్టంచేశారు. గవర్నర్‌ సోమవారం లఘు, చిన్న, మధ్య తరహా పరిశ్రమల (ఎంఎస్‌ఎంఈ) ప్రతినిధులతో సమావేశమయ్యారు. రెండు గంటలపాటు జరిగిన ఈ సమావేశంలో ఆయా రంగాలు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకున్నారు.  అనంతరం విలేకరులతో మాట్లాడుతూ... మంగళవారం నాన్‌ బ్యాంకింగ్‌ ఫైనాన్స్‌  కంపెనీల (ఎన్‌బీఎఫ్‌సీ) ప్రతినిధులతో కూడా సమావేశమవుతానని, ఈ రంగంలో నగదు లభ్యత సమస్యల్ని తెలుసుకుంటామని చెప్పారు. 

ఎప్పటికప్పుడు సమీక్ష... 
లిక్విడిటీ అంశంపై ఆర్‌బీఐ క్రమం తప్పకుండా సమీక్ష నిర్వహిస్తుందని దాస్‌ చెప్పారు. ‘‘ఎట్టి పరిస్థితుల్లోనూ వ్యవస్థలో నగదు కొరత రానివ్వం. అదే సమయంలో అవసరానికి మించి ద్రవ్యం వ్యవస్థలో ఉండడాన్ని కూడా ఆర్‌బీఐ అనుమతించదు. వ్యవస్థలో ద్రవ్య లభ్యతను జాగ్రత్తగా పరిశీలిస్తూ, అవసరం మేరకు ఉండేలా ఆర్‌బీఐ జాగ్రత్తలు తీసుకుంటుంది’’ అని దాస్‌ ఈ సందర్భంగా స్పష్టం చేశారు. గతనెల్లో దాస్‌ ప్రభుత్వ, ప్రైవేటు రంగ బ్యాంకర్లతో సమావేశమయ్యారు. వ్యవస్థలో నగదు లభ్యత, ఎంఎస్‌ఎంఈ పరిశ్రమలకు రుణ పరిస్థితులపై ప్రధానంగా చర్చించారు. తర్వాత ఈ నెల మొదట్లో  రూ. 25 కోట్ల వరకూ రుణం ఉండి, చెల్లించలేకపోతున్న రుణాన్ని, ఒకేసారి పునర్‌వ్యవస్థీకరించడానికి ఆర్‌బీఐ అనుమతించింది. అయితే సంస్థ రుణం పునర్‌వ్యవస్థీకరించే నాటికి, ఆ సంస్థ జీఎస్‌టీలో నమోదై ఉండాలి.  జీఎస్‌టీ నమోదు అవసరం లేదని మినహాయింపు పొందిన ఎంఎస్‌ఎంఈలకు ఇది వర్తించదు.  

మధ్యంతర డివిడెండ్‌పై ఆర్‌బీఐ నిర్ణయం 
కేంద్రానికి తాను మధ్యంతర డివిడెండ్‌ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఎంతివ్వాలన్న అంశాన్ని ఆర్‌బీఐ నిర్ణయిస్తుందని గవర్నర్‌ పేర్కొన్నారు. గత ఆర్థిక సంవత్సరం కేంద్రానికి ఆర్‌బీఐ ఇచ్చిన మధ్యంతర డివిడెండ్‌ రూ.10,000 కోట్లు. ఆర్థిక సంవత్సరం మొత్తంలో రూ. 50,000 కోట్లు డివిడెండ్‌గా బదలాయించింది. ‘‘2018–19లో ఎంత మధ్యంతర డివిడెండ్‌ ఇస్తుందన్న విషయం ఆర్‌బీఐ ప్రకటించినప్పుడు మీకు తెలుస్తుంది’’ అని శక్తికాంతదాస్‌ పేర్కొన్నారు. ఆర్‌బీఐ, జాతీయ బ్యాంకులు, ఆర్థిక సంస్థల నుంచి 2018–19లో రూ.54,817.25 కోట్ల డివిడెండ్‌ వస్తుందని బడ్జెట్‌ అంచనావేసింది.  

2,000 నోట్లపై ఇక చెప్పేదేమీలేదు.. 
వ్యవస్థ నుంచి రూ.2,000 నోట్లను దశలవారీగా తొలగిస్తారన్న వార్తలపై గవర్నర్‌ సమాధానం ఇస్తూ, ‘‘ఆర్థిక వ్యవహారాల శాఖ ఈ విషయంపై ఇప్పటికే ఒక ప్రకటన చేసింది. దీనిపై ఇంకా చెప్పాల్సింది ఏదీ లేదు’’ అన్నారు. డీమోనిటైజేషన్‌ తర్వాత ప్రవేశపెట్టిన రూ.2,000 నోట్ల ముద్రణను ప్రస్తుతానికి నిలిపివేసినట్లు కేంద్రం  వెల్లడించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతానికి తగినంత స్థాయిలో రూ.2,000 నోట్లు ఉన్నాయని ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి సుభాష్‌ చంద్ర గర్గ్‌ తెలిపారు. 

ఎన్‌పీఏలపై బ్యాంకులకు ‘టార్గెట్‌’ లేదు 
మొండిబకాయిల (ఎన్‌పీఏ)ల సవాలు పరిష్కారంలో బ్యాంకులకు ఏదైనా లక్ష్యాలు నిర్దేశిస్తున్నారా? అన్న ప్రశ్నకు అలాంటిదేమీ లేదని గవర్నర్‌ స్పష్టం చేశారు. బ్యాంకుల మొండిబకాయిల స్థాయి తగ్గుతోందని కూడా ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు. ప్రత్యేకించి ఈ విషయంలో ప్రభుత్వ రంగ బ్యాంకుల పనితీరు బాగుందన్నారు. 2018 మార్చిలో రూ.9.62 లక్షల కోట్లకు చేరిన ప్రభుత్వ రంగ బ్యాంకుల మొండిబకాయిలు అటు తర్వాత రూ.23,000 కోట్లకు తగ్గాయి.

ఇష్టానుసారం  రైతు రుణ మాఫీ సరికాదు! 
ఇష్టానుసారంగా రైతు రుణ మాఫీ మంచి విధానం కాదని ఆర్‌బీఐ గవర్నర్‌ పేర్కొన్నారు. ఇది దేశ బ్యాంకింగ్‌ రుణ వ్యవస్థపై అలాగే పునఃచెల్లింపులకు సంబంధించి రుణ గ్రహీత ప్రవర్తనపై ప్రతికూల ప్రభావం చూపుతుందని ఆయన పేర్కొన్నారు. వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు రైతు రుణ మాఫీ ప్రకటనలు చేస్తున్న నేపథ్యంలో శక్తికాంతదాస్‌ తాజా ప్రకటన చేశారు. రాష్ట్రాల ద్రవ్యలోటు అంశంపై ప్రతికూల ప్రభావం చూపే అంశమిదని ఆయన అన్నారు. ‘‘ఎన్నికైన ప్రతి ప్రభుత్వానికీ తమ ఆర్థిక అంశాలకు సంబంధించి నిర్ణయం తీసుకునే అధికారం ఉంది. అయితే రైతు రుణ మాఫీకి సంబంధించి ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు తమ ద్రవ్య పరిస్థితులపై చాలా జాగరూకతతో కూడిన నిర్ణయం తీసుకోవడం అవసరం. ప్రతి ప్రభుత్వమూ తమ ఆర్థిక పరిస్థితులను గమనించుకోవాలి. రుణ మాఫీకి సంబంధించి బ్యాంకులకు తక్షణం డబ్బు బదలాయించగలమా? లేదా? అన్నది పరిశీలించుకోవాలి’’ అని గవర్నర్‌ పేర్కొన్నారు. ఇటీవల కొత్త ప్రభుత్వాలు కొలువుదీరిన మధ్యప్రదేశ్, రాజస్తాన్, ఛత్తీస్‌గఢ్‌లలో రూ.1.47 లక్షల కోట్ల వ్యవసాయ రుణ మాఫీ ప్రకటనలు జరిగాయి. 

ప్రభుత్వానికి డివిడెండ్‌ రూ.40,000 కోట్లు?
రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) వచ్చే మార్చిలోపు కేంద్రానికి రూ.30,000 కోట్ల నుంచి రూ. 40,000 కోట్ల మధ్యంతర డివిడెండ్‌ ఇచ్చే అవకాశం ఉందని ఈ అంశంతో సంబంధమున్న అత్యున్నత స్థాయి వర్గాలు తెలిపాయి. ప్రధాని నరేంద్రమోదీ పాలనా యంత్రాంగం ద్రవ్యలోటు (ఒక నిర్దిష్ట కాలంలో ప్రభుత్వానికి వచ్చే ఆదాయం–చేసే వ్యయం మధ్య నికర వ్యత్యాసం) పూడ్చుకోడానికి ఈ మొత్తం దోహదపడే అవకాశం ఉంది.  గత ఆర్థిక సంవత్సరం కేంద్రానికి ఆర్‌బీఐ రూ.10,000 కోట్ల మధ్యంతర డివిడెండ్‌ను చెల్లించింది.  జూలై–జూన్‌ మధ్య పన్నెండు నెలల కాలాన్ని ఆర్‌బీఐ తన ఆర్థిక సంవత్సరంగా పరిగణిస్తోంది.  

నేపథ్యం ఇదీ..: కేంద్ర ప్రభుత్వానికి పన్ను వసూళ్లు తగ్గిన నేపథ్యంలో– భారత్‌ ద్రవ్యలోటు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం కట్టుతప్పే అవకాశాలు కనిపిస్తున్నాయి.  ఈ ఏడాది ఏప్రిల్‌ నుంచి ప్రారంభమై మార్చి 2019తో ముగిసే ఆర్థిక సంవత్సరంలో నవంబర్‌ నెలకు వచ్చేసరికే ద్రవ్యలోటు బడ్జెట్‌ నిర్దేశాలను దాటిపోయింది. 2018–19  ఆర్థిక సంవత్సరం స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో 3.3 శాతంగా ద్రవ్యలోటు ఉండాలని వార్షిక బడ్జెట్‌ నిర్దేశించింది. 

మరిన్ని వార్తలు