ప్రవాసులు దిగొస్తున్నారు! 

11 May, 2019 00:02 IST|Sakshi

ఎన్‌ఆర్‌ఐలు ఇండియాకి తిరిగొస్తున్నారు. భౌతికంగా కాదు.. రియల్‌ ఎస్టేట్‌ పెట్టుబడులు రూపంలో! బినామీ లావాదేవీల చట్టం, రెరా,జీఎస్‌టీలతో స్థిరాస్తి రంగంలోపారదర్శకత, లావాదేవీల్లో జవాబుదారీతనం పెరిగింది. వీటికి తోడు 100 శాతం ఎఫ్‌డీఐ, రీట్స్‌ పెట్టుబడులకుపచ్చజెండా ఊపడంతో ప్రపంచ దేశాల్లోని ప్రవాసుల్లో జోష్‌ నెలకొంది. దీంతో భారత స్థిరాస్తి రంగంలో ఎన్‌ఆర్‌ఐల ఇన్వెస్ట్‌మెంట్స్‌
 క్రమంగా పెరుగుతున్నాయి. 

సాక్షి, హైదరాబాద్‌: రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) నివేదిక ప్రకారం.. ప్రపంచ దేశాల్లోని ప్రవాస భారతీయులు (ఎన్‌ఆర్‌ఐ) 2018లో 79 బిలియన్‌ డాలర్ల చెల్లింపులు నిర్వహించారు. ఇందులో సింహభాగం లావాదేవీలు రియల్‌ ఎస్టేట్‌ రంగంలోనే జరిగాయి. యూఏఈ, అమెరికా, యూకే, కెనడా వంటి దేశాలకు చెందిన ఎన్‌ఆర్‌ఐలు దేశీయ రియల్‌ ఎస్టేట్‌లో ఇన్వెస్ట్‌మెంట్స్‌కు ఆసక్తి చూపిస్తున్నారు. ప్రతి ఏటా ఎన్‌ఆర్‌ఐల పెట్టుబడులు 2–3 శాతం వరకు పెరుగుతున్నాయని అనరాక్‌ ప్రాపర్టీ కన్సల్టెన్స్‌ మిడిల్‌ ఈస్ట్‌ సీఈఓ షాజాయ్‌ జాకబ్‌ తెలిపారు. ఆర్ధిక సంస్కరణలు, స్థిరాస్తి రంగంలో పారదర్శకత, స్థిరమైన ప్రభుత్వ పాలన, విధానాలు వంటి కారణాలతో విదేశీ ఇన్వెస్ట్‌మెంట్స్‌ పెరుగుతున్నాయి. నిర్మాణ అభివృద్ధి పనుల్లో 100 శాతం విదేశీ పెట్టుబడులకు, కమర్షియల్‌ ప్రాపర్టీల్లో రియల్‌ ఎస్టేట్‌ రెగ్యులేటరీ అథారిటీ (రీట్స్‌) పెట్టుబడులకు అవకాశం కల్పించడం వంటివి ఎన్‌ఆర్‌ఐ పెట్టుబడుల వృద్ధికి కారణాలుగా చెప్పవచ్చు. 

యూఏఈ నుంచే ఎక్కువ ఇన్వెస్ట్‌మెంట్స్‌.. 
యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ (యూఏఈ)లో ఇండియన్‌ జనాభా 33 లక్షలు. భారతదేశం వెలుపల అధికంగా ఇండియన్స్‌ ఉన్న దేశం యూఏఈనే. దుబాయ్‌లోని ఎన్‌ఆర్‌ఐలు అధికంగా రియల్‌ ఎస్టేట్‌ రంగంలో పెట్టుబడులు పెడుతుంటారు. దిర్హంతో పోలిస్తే ఇండియన్‌ రూపాయి విలువ తక్కువగా ఉండటంతో ఇక్కడ పెట్టుబడులకే అధిక ప్రాధాన్యమిస్తుంటారు. 2018లో ప్రపంచ దేశాల్లోని ఎన్‌ఆర్‌ఐలు ఇండియాకు పంపించిన సొమ్ములో 26.9 శాతం యూఏఈ వాటా ఉందని ఆర్‌బీఐ తెలిపింది. 

పెట్టుబడులకు నివాసాలే కరెక్ట్‌.. 
గతంలో ఎన్‌ఆర్‌ఐలు హై ఎండ్‌ లగ్జరీ ప్రాపర్టీల్లో పెట్టుబడులు పెడుతుండేవారు. వాటిని అద్దెకు ఇచ్చి నివాసితులకు అంతర్జాతీయ వసతులు, జీవనశైలిని కల్పించేవారు. ఇన్వెస్టర్లకు అద్దెల్లో వృద్ధి కూడా కనిపించేది. అయితే ప్రస్తుతం ఎన్‌ఆర్‌ఐలు అందుబాటు గృహాల మీద ఫోకస్‌ చేస్తున్నారు. ఎందుకంటే ప్రభుత్వాలు అఫడబుల్‌ హౌజింగ్‌లకు పన్ను రాయితీలు, ప్రోత్సాహకాలను అందిస్తున్నాయి. దీంతో అందుబాటు గృహాలకు డిమాండ్‌ పెరిగింది. పైగా దీర్ఘకాలిక అద్దెలతో పాటూ ఆదాయంలో పన్ను రాయితీలు కూడా ఉంటాయి. 

రెరాలో నమోదైతేనే.. 
ఎన్‌ఆర్‌ఐ ఇన్వెస్టర్లను ఆకర్షించేందుకు డెవలపర్లు ప్రత్యేక రాయితీలు, డిస్కౌంట్లను ప్రకటిస్తుంటాయి. వీటితో ప్రాజెక్ట్‌ నిర్మాణ స్థితిగతులను ఎప్పటికప్పుడు అందజేసేందుకు ఆగ్యుమేటెడ్‌ రియాలిటీ (ఏఆర్‌), వర్చువల్‌ రియాలిటీ (వీఆర్‌) టెక్నాలజీని వినియోగిస్తున్నారు. ఆర్గనైజ్‌ డెవలపర్లు, రియల్‌ ఎస్టేట్‌ రెగ్యులేటరీ అథారిటీ (రెరా)లో నమోదైన ప్రాజెక్ట్‌ల్లో పెట్టుబడులకే ఎన్‌ఆర్‌ఐలు ఆసక్తి చూపిస్తున్నారు. సొంత రాష్ట్రం, నగరంలోనే పెట్టుబడులకు ఎన్‌ఆర్‌ఐలు ఆసక్తి చూపిస్తున్నారు. ఎందుకంటే తెలిసిన ప్రాంతం కావటం, అద్దె వసూళ్లు, ప్రాపర్టీల నిర్వహణ, పర్యవేక్షణ వంటివి సులువవుతాయని వారి అభిప్రాయం.   

ఈ నగరాల్లో ఎందుకంటే? 
ఎన్‌ఆర్‌ఐల పెట్టుబడులు ఆకర్షించే ప్రధాన నగరం ఢిల్లీ–ఎన్‌సీఆర్‌. ఆ తర్వాత బెంగళూరు, ముంబై, పుణే, హైదరాబాద్, చెన్నై నగరాలుంటాయి. కారణమేంటంటే? 
►ఆయా నగరాల్లో ఆర్థికాభివృద్ధి కారణంగా నూతన ఉద్యోగ అవకాశాలు. 
►సులువైన వ్యాపార విధానాలు 
► మెరుగైన మౌలిక సదుపాయాలు, జీవనశైలి 
►మెరుగైన రవాణా సదుపాయాలు. ఇంట్రా సిటీ రోడ్లతో పాటూ జాతీయ రహదారుల నిర్మాణం, విమాన సేవలతో అనుసంధానం. 

మరిన్ని వార్తలు