పాత డీజిల్‌ కార్లను పట్టుకెళ్లిపోతున్నారు!!

8 Oct, 2018 19:33 IST|Sakshi

న్యూఢిల్లీ : పొద్దున్న ఆరు అయినా కూడా చీకటి మబ్బులు దుప్పటి తెరవని రోజులు రాబోతున్నాయి. దీంతో ఓ వైపు పొగమంచు, మరోవైపు కాలుష్యం దేశ రాజధానిని పట్టి పీడించబోతున్నాయి. ఈ నేపథ్యంలో కర్బన్‌ ఉద్గారాలను తగ్గించేందుకు ఢిల్లీ రవాణా మంత్రిత్వ శాఖ చర్యలు ప్రారంభించింది. 15 ఏళ్లకు పైబడిన వాహనాలు రోడ్లపైకి ఎక్కకుండా ఉండేందుకు ఆ వాహనాలను డీరిజిస్ట్రర్‌ చేయడం, రద్దు చేయడం చేస్తోంది. సీజ్‌ చేసి పట్టుకెళ్లిన వాహనాలను తిరిగి యజమానులకు ఇవ్వకూడదని కూడా ఢిల్లీ రవాణా శాఖ ఆలోచిస్తోంది. సీజ్‌ చేసిన, రద్దు చేసిన వాహనాలను ప్రభుత్వ రంగ ఎంఎస్‌టీసీ లిమిటెడ్‌కు అప్పజెప్పబోతున్నారు. అంతేకాక ఆ వాహనాలు వాడిన యజమానులకు మున్సిపల్‌ కార్పొరేషన్స్‌, ట్రాన్స్‌పోర్ట్‌ డిపార్ట్‌మెంట్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ టీమ్‌లు కలిసి అదనంగా జరిమానాలు కూడా విధించబోతున్నాయి. 

‘మరికొన్ని రోజుల్లో శీతాకాలం ప్రారంభం కాబోతుంది. కాలుష్యం ప్రమాదకర స్థాయికి చేరుకోబోతుంది. దీంతో 15 ఏళ్లకు పైబడిన డీజిల్‌ వాహనాలను సీజ్‌ చేసే డ్రైవ్‌ ప్రారంభించాం. పబ్లిక్‌ ప్రాంతాల్లో పార్క్‌ చేసినా, ఇళ్లలో ఉన్నా వీటిని తీసుకెళ్లిపోతాం. ఇతర వాహనాల విషయంలో పొల్యుషన్‌ అండర్‌ కంట్రోల్‌(పీయూసీ) సర్టిఫికేట్లు ఉన్నాయో లేవో తమ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ టీమ్స్‌ పరిశీలించనున్నాయి’ అని రవాణా శాఖ మంత్రి కైలాష్ గహ్లోట్ చెప్పారు. 

ప్రభుత్వ డేటా ప్రకారం ఢిల్లీలో కోటికి పైగా రిజిస్ట్రర్‌ వాహనాలు ఉన్నాయి. వాటిలో 15 ఏళ్లకు పైబడినవి 3,70,000. 15 ఏళ్లకు పైబడినవి రోడ్లపై తిరగడానికి వీలులేదని నేషనల్‌ గ్రీన్‌ ట్రిబ్యునల్‌(ఎన్‌జీటీ) ఆర్డర్‌తో 2016 జనవరి నుంచి ఇప్పటి వరకు 2,23,000 డీజిల్‌ వాహనాలను డీరిజిస్ట్రర్‌ చేశారు. ఎన్‌జీటీ ఆర్డర్‌ ప్రకారం వాటిని పబ్లిక్‌ ప్రాంతాల్లో పార్క్‌ చేయడానికి కూడా వీలు లేదు. ఢిల్లీలో చాలా ఇళ్లలో సొంత పార్కింగ్‌ స్థలం లేదు. యజమానులు ఈ వాహనాలను ఢిల్లీ వెలుపల అమ్మేయాల్సి ఉంది. అయితే అమ్మేయకుండా అలానే ఉంచుకుని, రోడ్లపైకి తీస్తున్న ఆ వాహనాలను ఢిల్లీ రవాణా శాఖ అధికారులు పట్టుకుపోతున్నారు. రోడ్లపై ఉన్నా.. పబ్లిక్‌  పార్కింగ్‌ ప్రదేశాల్లో ఉన్నా.. ఇళ్లలో ఉన్నా వీటిని రవాణా శాఖ సీజ్‌ చేస్తోంది.

మరిన్ని వార్తలు