గెయిల్, ఐవోసీలో ఓఎన్‌జీసీ వాటా విక్రయం..!

29 Sep, 2017 00:55 IST|Sakshi

హెచ్‌పీసీఎల్‌ కొనుగోలు కోసం నిధుల సమీకరణ

న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ ఇంధన దిగ్గజం ఓఎన్‌జీసీ ప్రస్తుతం రిఫైనరీ సంస్థ హెచ్‌పీసీఎల్‌ను కొనుగోలు చేసేందుకు అవసరమైన నిధులను సమీకరించుకునే పనిలో పడింది. ఇందులో భాగంగా ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్, గెయిల్‌ ఇండియాలో తనకున్న వాటాలను విక్రయించనున్నట్లు కంపెనీ చైర్మన్‌ డీకే సరాఫ్‌ చెప్పారు. దేశీయంగా అతి పెద్ద రిఫైనర్‌ అయిన ఐవోసీలో ఓఎన్‌జీసీకి 13.77 శాతం వాటా ఉంది. ప్రస్తుత మార్కెట్‌ ధర ప్రకారం దీని విలువ సుమారు రూ. 26,600 కోట్లు. ఇక గెయిల్‌లో ఉన్న 4.87 శాతం వాటాల విలువ దాదాపు రూ.1,637 కోట్లు. హెచ్‌పీసీఎల్‌లో 51.11 శాతం ప్రభుత్వ వాటాలను కొనుగోలు చేసేందుకు ఓఎన్‌జీసీకి సుమారు రూ.32,000 కోట్లు కావాలి.

స్టాండెలోన్‌ ప్రాతిపదికన తమకి రుణభారమేదీ లేనందున మార్కెట్‌ నుంచైనా సమీకరిస్తామని, అలాగే మిగతా చమురు కంపెనీల్లో వాటాలను కూడా విక్రయించి.. హెచ్‌పీసీఎల్‌ కొనుగోలుకు అవసరమైన నిధులు సమకూర్చుకుంటామని సరాఫ్‌ వివరించారు. సంస్థ వద్ద ప్రస్తుతం రూ.10,000 కోట్ల నగదు నిల్వ లుండగా, రూ. 25,000 కోట్ల మేర రుణ సమీకరణ చేసేందుకు కంపెనీ షేర్‌హోల్డర్లు ఆమోదం తెలిపారని చెప్పారాయన. డిసెంబర్‌లోగా డీల్‌ ముగిసే అవకాశం ఉందన్నారు. యాజమాన్య బదలాయింపు మొదలైనవేమీ లేనందున ఓపెన్‌ ఆఫర్‌ ప్రకటించాల్సిన అవసరం ఉండదని ఆయన స్పష్టం చేశారు.

మరిన్ని వార్తలు