చెల్లించాల్సింది రూ.25–30 కోట్లు

26 Nov, 2019 05:34 IST|Sakshi

వారంలోగా తిరిగి చెల్లించేస్తాం

కార్వీ గ్రూప్‌ చైర్మన్‌ సి.పార్థసారథి

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: కార్వీ స్టాక్‌ బ్రోకింగ్‌ (కేఎస్‌బీఎల్‌) తన కస్టమర్లకు చెల్లించాల్సిన బకాయిలు రూ.25–30 కోట్ల వరకూ ఉంటాయని కార్వీ గ్రూప్‌ చైర్మన్‌ సి.పార్థసారథి వెల్లడించారు. వీటిని రెండు వారాలు లేదా అంతకన్నా ముందే చెల్లించేస్తామని ఆయన స్పష్టం చేశారు. పెద్ద ఎత్తున నిధుల మళ్లింపు జరిగిందన్న వార్తల నేపథ్యంలో ఆయన ఈ వివరణ ఇచ్చారు. ఇవి దాదాపు 150–180 మంది క్లయింట్ల బకాయిలని తెలియజేశారు. కార్వీ స్టాక్‌ బ్రోకింగ్‌ నుంచి రియల్‌ ఎస్టేట్‌ విభాగానికి నిధులు మళ్లాయన్న ఎన్‌ఎస్‌ఈ ఆరోపణల నేపథ్యంలో.. గ్రూప్‌నకు హోల్డింగ్‌ కంపెనీ కేఎస్‌బీఎల్‌ కాబట్టే దాన్నుంచి నిధులు బదలాయించినట్లు చెప్పారు. పలు అనుబంధ కంపెనీల్లో కేఎస్‌బీఎల్‌ పెట్టుబడులున్నాయని గుర్తు చేశారు. కంపెనీ వాదన వినకుండానే సెబీ ఎక్స్‌పార్టీ ఉత్తర్వులు జారీ చేసిందని చెబుతూ... దీనిపై సెబీని సంప్రతిస్తామని తెలిపారు. కేఎస్‌బీఎల్, దాని అనుబంధ కంపెనీలన్నీ లాభాల్లోనే ఉన్న విషయాన్ని ఆయన గుర్తుచేశారు. 

మరిన్ని వార్తలు