ఒపెక్‌ దృష్టికి అధిక ధరల అంశం

11 Apr, 2018 00:34 IST|Sakshi

ఒపెక్‌ సెక్రటరీతో పెట్రోలియం మంత్రి ప్రధాన్‌ భేటీ

న్యూఢిల్లీ: పెట్రోలియంపై ఆసియా దేశాల నుంచి అధిక ధరలను వసూలు చేస్తున్న అంశాన్ని ఒపెక్‌ సెక్రటరీ జనరల్‌ మొహమ్మద్‌ శానుసి బక్రిండో దృష్టికి పెట్రోలియం మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ తీసుకెళ్లారు. భారత పర్యటనకు వచ్చిన బక్రిండోతో ప్రధాన్‌ మంగళవారం భేటీ అయి పలు విషయాలపై చర్చించారు.

ఆసియా దేశాల నుంచి ప్రీమియం ధరలను ఒపెక్‌ సభ్య దేశాలు వసూలు చేస్తున్నాయంటూ మన దేశం ఎప్పటి నుంచో ఆందోళన వ్యక్తం చేస్తూనే ఉంది. ఒపెక్‌ చమురు ఉత్పత్తికి కోత విధించడం వల్ల అస్థిరతలు అధికం కావడం, ధరలు పెరగడం వల్ల భారత్‌పై పడే ప్రభావాన్ని పెట్రోలియం మంత్రి వివరించారు. ఆసియాలో ప్రీమియం ధరల అంశంపైనా తగినంత చర్చించినట్టు, భారత్‌ తరహా దేశాలకు వాస్తవిక ధరలు ఉండాలన్న అంశాన్ని గుర్తు చేసినట్టు పెట్రోలియం మంత్రిత్వ శాఖ తెలిపింది.

చమురు అవసరాల్లో మన దేశం 80 శాతానికి పైగా దిగుమతి చేసుకుంటున్న విషయం తెలిసిందే. దేశీయ అవసరాల్లో ముడి చమురు 86 శాతం, సహజ గ్యాస్‌ 75 శాతం, ఎల్పీజీ 95 శాతాన్ని ఒపెక్‌ దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నాం. ఇటీవలి అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు పెరగడంతో దేశీయంగానూ వాటి ధరలు గరిష్ట స్థాయిలకు చేరాయి.  

మరిన్ని వార్తలు