కొత్త బ్యాంకు ఖాతాల ప్రారంభం సగం భారత్‌లోనే

21 Apr, 2018 00:28 IST|Sakshi

ప్రపంచ బ్యాంకు నివేదికలో వెల్లడి

న్యూఢిల్లీ: ఆర్థిక సేవలను అందరికీ చేరువ చేసేందుకు కేంద్రం చేస్తున్న ప్రయత్నాలకు గుర్తింపు లభించింది. అంతర్జాతీయంగా 2014–17 మధ్య కాలంలో కొత్తగా ప్రారంభమైన బ్యాంకు ఖాతాల్లో 55 శాతం భారత్‌లోనే ఉన్నట్టు ప్రపంచ బ్యాంకు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయని కేంద్ర ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి రాజీవ్‌కుమార్‌ తెలిపారు. ప్రపంచ బ్యాంకు గ్లోబల్‌ ఫిండెక్స్‌ నివేదిక భారత ప్రయత్నాలను గుర్తించిందన్నారు.

సామాన్యులను కూడా బ్యాంకు సేవలకు చేరువ చేసేందుకు కేంద్రం ప్రారంభించిన జన్‌ధన్‌ యోజన కార్యక్రమం విజయాన్ని ప్రపంచబ్యాంకు తన నివేదికలో పేర్కొనడం గమనార్హం. ప్రపంచ బ్యాంకు ఫిండెక్స్‌ నివేదిక ప్రకారం 2014లో వయోజనుల బ్యాంకు ఖాతాలు 53 శాతంగా ఉండగా, అవి 2017 నాటికి 80 శాతానికి పెరిగాయని రాజీవ్‌ కుమార్‌ తెలిపారు. 2014లో బ్యాంకు ఖాతాల పరంగా స్త్రీ, పురుషుల మధ్య 20 శాతం అంతరం ఉంటే, ప్రభుత్వం తీసుకున్న చర్యల వల్ల అది 6 శాతానికి తగ్గిందని చెప్పారు.   

మరిన్ని వార్తలు