నౌకాశ్రయం ఉన్న చోటే ఓరియంట్‌ ఎలక్ట్రిక్‌ కొత్త ప్లాంట్‌

5 Mar, 2020 05:27 IST|Sakshi
కొత్త ఎయిర్‌ కూలర్లతో సలీల్‌ కపూర్‌(ఎడమ వ్యక్తి), రాకేష్‌ ఖన్నా

ప్రభుత్వ విధానాలు, కార్మికుల నైపుణ్యతే ప్రధాన అంశాలు

తొలి దశలో ఫ్యాన్ల తయారీ మాత్రమే ఓరియంట్‌ ఎలక్ట్రిక్‌

ఎండీ అండ్‌ సీఈఓ రాకేష్‌ ఖన్నా

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: సీకే బిర్లా గ్రూప్‌కు చెందిన కన్జ్యూమర్‌ ఎలక్ట్రానిక్స్‌ తయారీ కంపెనీ ఓరియంట్‌ ఎలక్ట్రిక్‌ దక్షిణాదిలో నూతన ప్లాంట్‌ను నెలకొల్పనుంది. ఇప్పటికే బోర్డ్‌ ఆమోదం పూర్తయిందని, ఎగుమతులకు వీలుగా ఉండే నౌకాశ్రయం ఉన్న రాష్ట్రంలోనే గ్రీన్‌ఫీల్డ్‌ ప్లాంట్‌ ఏర్పాటుకు నిర్ణయించామని కంపెనీ సీఈఓ రాకేష్‌ ఖన్నా తెలిపారు. స్థానిక ప్రభుత్వ విధానాలు, కార్మికుల నైపుణ్యత, అందుబాటులో స్థల లభ్యత వంటివి ప్లాంట్‌ ఏర్పాటులో ప్రధాన అంశాలని ఆయన పేర్కొన్నారు. కొత్త ప్లాంట్‌లో తొలి దశలో ఫ్యాన్లను మాత్రమే ఉత్పత్తి చేస్తామని, ఆ తర్వాత ఎయిర్‌ కూలర్లు, ఇతర గృహోపకరణాల తయారీ ఉంటుందని చెప్పారు. ప్రస్తుతం ఓరియంట్‌ ఎలక్ట్రిక్‌కు కోల్‌కతా, ఫరీదాబాద్, నోయిడా, గౌహతీలో నాలుగు ప్లాంట్లున్నాయి. 40 అంతర్జాతీయ మార్కెట్లకు ఫ్యాన్లను ఎగుమతి చేస్తుంది.

మార్కెట్లోకి కొత్త ఎయిర్‌ కూలర్లు..
బుధవారమిక్కడ ఎనర్జీ ఇఫీషియన్సీ ఇన్వెర్టర్‌ ఎయిర్‌ కూలర్లను ప్రవేశపెట్టిన సందర్భంగా హోమ్‌ అప్లియెన్సెస్‌ బిజినెస్‌ హెడ్‌ సలీల్‌ కపూర్‌తో కలిసి రాకేష్‌ ఖన్నా విలేకరులతో మాట్లాడారు. ఈసీఎం టెక్నాలజీతో నడిచే ఈ కూలర్లతో 50 శాతం వరకు విద్యుత్‌ ఆదా అవుతుందని తెలిపారు. ఐవోటీ ఆధారిత ఈ ఎయిర్‌ కూలర్లను స్మార్ట్‌ఫోన్‌ లేదా అలెక్సాతో నియంత్రణ చేసుకోవచ్చు. 8 లీటర్ల నుంచి 105 లీటర్ల వరకు 54 రకాల ఎయిర్‌ కూలర్లున్నాయి. వీటి ధరల శ్రేణి రూ.5,190 నుంచి రూ.19,900 మధ్య ఉన్నాయి.

తెలుగు రాష్ట్రాల్లో 25 శాతం మార్కెట్‌ వాటా..
దేశవ్యాప్తంగా ఏటా 29 లక్షల ఓరియంట్‌ ఎలక్ట్రిక్‌ ఎయిర్‌ కూలర్లు విక్రయమవుతుంటే.. ఇందులో 4.7 లక్షల యూనిట్లు ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లోనే జరుగుతున్నాయి. ఎయిర్‌ కూలర్లు, ఫ్యాన్లు, గృహోపకరణాలు అన్ని కలిపి ఏపీ, తెలంగాణలో 18–19 శాతం మార్కెట్‌ వాటా ఉందని, రెండేళ్లలో 25 శాతం మార్కెట్‌ వాటాను లకి‡్ష్యంచామన్నారు. ఓరియంట్‌ ఎలక్ట్రిక్‌ నుంచి లైటింగ్, హోమ్‌ అప్లయెన్సెస్, స్విచ్‌ గేర్స్‌ వంటి ఉత్పత్తులు కూడా ఉన్నాయి. 450 నగరాల్లో సుమారు 4 వేల మంది డీలర్లు, 1.25 లక్షల రిటైల్‌ ఔట్‌లెట్లున్నాయి. త్వరలోనే తెలుగు రాష్ట్రాల్లో సొంతంగా ఎక్స్‌క్లూజివ్‌ ఔట్‌లెట్లను తెరవనున్నట్లు ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం బెంగళూరు, ఎన్‌సీఆర్, చండీఘడ్‌ నగరాల్లో మాత్రమే ఉన్నాయి.

మరిన్ని వార్తలు