లక్షకు పైగా ఉద్యోగాలు పోయాయ్‌

7 Dec, 2019 14:50 IST|Sakshi

సాక్షి, ముంబై: దేశీయ ఆటో పరిశ్రమం సంక్షోభం, ఇతర సెగ్మెంట్లను తీవ్రంగా ప్రభావితం చేస్తోంది. ఈ ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్-సెప్టెంబర్ కాలంలో ఆటోరంగ ఉత్పత్తి 13 శాతం క్షీణతను నమోదు చేసింది. డిమాండ్ తగ్గడం, ఆర్థికమందగనం కారణంగా పలు సంస్థలు ఇప్పటికే తమ ఉత్పత్తి ప్లాంట్లను తాత్కాలికంగా మూసేశాయి. దీంతో ఆటో రంగంలోనూ ఉద్వాసనలకు తెర లేచింది.  అంతేకాదు ఈ ప్రభావంతో ఆటో స్పేర్స్‌లో ఈ ఏడాది జూలై నాటికి 1 లక్ష మంది తమ తాత్కాలిక ఉద్యోగాలు కోల్పోయారని ఆటోమోటివ్ కాంపోనెంట్ మ్యానుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ (ఏసీఎంఏ) శుక్రవారం తెలిపింది.

ఊహించనంత సుదీర్ఘమైన మందగమనం వాహన పరిశ్రమను దెబ్బతీస్తోందని, అమ్మకాలు బాగా తగ్గాయని, ఇది ఇతర సెగ్మెంట్లను దెబ్బతీస్తోదని అసోసియషన్‌ ప్రెసిడెంట్ దీపక్ జైన్ చెప్పారు. 2013-14 తర్వాత మళ్లీ ఇలాంటి పరిస్థితులేర్పడ్డాయని ఆయన తెలిపారు. ముఖ్యంగా ఆటో  ఉత్పత్తి తగ్గడంతో విడిభాగాల పరిశ్రమ సామర్థ్య వినియోగం 50 శాతం పడిపోయినట్లు తెలిపింది. గతంలో ఇది గరిష్టంగా 80 శాతం నమోదయిందన్నారు.

భారతదేశపు 57 బిలియన్ డాలర్ల ఆటోమోటివ్ కాంపోనెంట్ పరిశ్రమ, దేశ జిడిపిలో 2.3 శాతం వాటాను కలిగిఉంది. అలాగే 5 మిలియన్లకు పైగా ఉద్యోగులను కలిగి ఉంది. ఆటో కంపోనెంట్ ఇండస్ట్రీ టర్నోవర్ గత ఏడాది ఏప్రిల్ - సెప్టెంబర్ కాలంలో రూ.1.99 లక్షల కోట్లుగా ఉంటే, ఈ ఏడాది ఇదే కాలంలో 10.1 శాతం తగ్గి రూ.1.79 లక్షల కోట్లుగా ఉందని అసోసియేషన్‌ పేర్కొంది. 2 బిలియన్ డాలర్ల పెట్టుబడులు నిలిచిపోయినట్లు పేర్కొంది. అయితే ఎగుమతులు 2.7శాతం పెరిగి రూ.51,397 వేల కోట్లకు (7.5 బిలియన్ డాలర్లు) చేరుకున్నాయని ఏసీఎంఏ తెలిపింది.

మరిన్ని వార్తలు