రోజుకు రూ.2,200 కోట్లు!

22 Jan, 2019 00:42 IST|Sakshi

గత ఏడాది పెరిగిన భారత కుబేరుల సంపద ఇది 

1 శాతం కుబేరుల చేతుల్లోనే   52 శాతం జాతీయ సంపద 

భారీగా పెరుగుతున్న ఆర్థిక అసమానతలు

ఆక్స్‌ఫామ్‌ తాజా నివేదిక వెల్లడి  

దావోస్‌: భారత్‌లో ఆర్థిక అసమానతలు బాగా పెరుగుతున్నాయని, దీనిని నివారించకపోతే భారత సామాజిక, ప్రజాస్వామ్య వ్యవస్థ కుప్పకూలుతుందని అంతర్జాతీయ హక్కుల సంఘం.. ఆక్స్‌ఫామ్‌  హెచ్చరించింది. కుబేరుల సంపద అంతకంతకూ పెరిగిపోతుండగా, జనాభాలో సగం మందికి కూడా కనీస అవసరాలు తీరడం లేదని ఈ సంస్థ తాజా నివేదిక పేర్కొంది. ఐదు రోజుల పాటు స్విట్జర్లాండ్‌లో జరిగే ప్రపంచ ఆర్థిక సదస్సు (వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరమ్‌–డబ్ల్యూఈఎఫ్‌) ఆరంభం కావడానికి ముందు ఆక్స్‌ఫామ్‌ సంస్థకీ నివేదిక విడుదల చేసింది. పేదలు, ధనవంతుల మధ్య అంతరం భారీగా పెరిగిపోతోందని, దీనిని నివారించే తక్షణ చర్యలు తీసుకోవాలని ఆక్స్‌ఫామ్‌ ఇంటర్నేషనల్‌ ఈడీ విన్నీ బ్యాన్‌ఇమా కోరారు. పెరుగుతున్న అసమానతలు ఆర్థిక వ్యవస్థలను అతలాకుతలం చేస్తున్నాయని, ప్రపంచవ్యాప్తంగా అశాంతి ప్రబలుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నివేదిక ఇంకా ఏం చెప్పిందంటే.., 

►భారత కుబేరుల సంపద గత ఏడాది రోజుకు రూ.2,200 కోట్లు చొప్పున పెరిగింది. ప్రపంచ కుబేరుల సంపద 12 శాతం లేదా రోజుకు 250 కోట్ల డాలర్ల మేర ఎగసింది. ప్రపంచంలోని పేదల సంపద మాత్రం 11 శాతం క్షీణించింది. 
►మన దేశంలోని అత్యంత ఐశ్వర్యవంతుల సంపద 39 శాతం వృద్ధి చెందగా, జనాభాలో సగ భాగం సంపద 3 శాతమే పెరిగింది. 
►భారత్‌లో అత్యంత పేదలైన 13.6 కోట్ల మంది(జనాభాలో పది శాతం) 2004 నుంచి అప్పుల ఊబిలో కూరుకుపోయే ఉన్నారు. 
►వృద్ధి చెందుతున్న భారత సంపదను కొందరు కుబేరులే అనుభవిస్తున్నారని, కానీ పేదలు ఒక పూట కూడా గడవని, పిల్లలకు మందులు కూడా కొనివ్వలేని దుర్భర పరిస్థితుల్లో ఉన్నా రు. ఇది ఇలాగే కొనసాగితే, భారత సామాజిక, ప్రజాస్వామ్య వ్యవస్థ కుప్పకూలుతుంది. 
►భారత జాతీయ సంపదలో 77.4%  10 శాతం అత్యంత ధనికుల చేతుల్లోనే ఉంది. 1% కుబేరుల చేతుల్లోనే 52% జాతీయ సంపద ఉంది. 
► జనాభాలోని 60 శాతం మంది చేతిలో కేవలం 4.8 శాతం సంపద మాత్రమే ఉంది.
► 9 మంది అత్యంత సంపన్నుల సంపద దేశ జ నాభాలోని సగం మంది సంపదతో సమానం. 
►  2022 నాటికి భారత్‌లో రోజుకు 70 మంది కొత్త కుబేరులు పుట్టుకొస్తారని అంచనా. 
►గత ఏడాది కొత్తగా 18 మంది బిలియనీర్లు అవతరించారు. దీంతో భారత్‌లోని బిలియనీర్ల సంఖ్య 119కు పెరిగింది. వీరందరి సంపద తొలిసారిగా గత ఏడాది 40,000 కోట్ల డాలర్లు(రూ.28 లక్షల కోట్లు)కు పెరిగింది.
►2017లో 32,550 కోట్లుగా ఉన్న బిలియనీర్ల సంపద గత ఏడాది 44,010 కోట్ల డాలర్లకు పెరిగింది. 2008 అంతర్జాతీయ ఆర్థిక సంక్షోభం తర్వాత బిలియనీర్ల సంపద ఒక్క ఏడాది ఈ స్థాయిలో పెరగడం ఇదే మొదటిసారి. 
►భారత కేంద్ర ప్రభుత్వం, భారత్‌లోని అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు వైద్య, ప్రజారోగ్యం, పారి శుధ్యం, నీటి సరఫరాల కోసం రూ.2,08,166 కోట్లు ఖర్చు చేస్తున్నాయి. ఇది భారత అత్యంత ధనవంతుడు ముకేశ్‌ అంబానీ సంపద (రూ.2.8 లక్షల కోట్లు) కంటే కూడా తక్కువే.

ఇంటిపని @10 లక్షల కోట్ల డాలర్లు
ప్రపంచవ్యాప్తంగా మహిళలు చేసే ఇంటిపని విలువ సుమారుగా 10 లక్షల కోట్ల డాలర్లుగా ఉంటుందని ఓక్స్‌ఫామ్‌ తెలిపింది. టర్నోవర్‌ పరంగా చూస్తే ప్రపంచంలోనే అతి పెద్ద కంపెనీ ఆపిల్‌ టర్నోవర్‌కు ఇది 43 రెట్లు అని ఈ సంస్థ పేర్కొంది. భారత్‌లో గృహిణులు చేసే ఇంటిపని, పిల్లల సంరక్షణ విలువ జడీపీలో 3.1 శాతానికి సమానం. ఇలాంటి పనుల కోసం మహిళలు గ్రామాల్లో ఐదున్నర గంటలు, పట్టణాల్లో ఐదు గంటలు చొప్పున వెచ్చిస్తున్నారు. ఇలాంటి పనుల కోసం పురుషులు మాత్రం ఒక్క అరగంట మాత్రమే కేటాయిస్తున్నారు. 
►వేతన వ్యత్యాసం స్త్రీ, పురుషుల మధ్య 34 శాతంగా ఉంది. 
►డబ్ల్యూఈఎఫ్‌ గ్లోబల్‌ జండర్‌ గ్యాప్‌ఇండెక్స్‌లో భారత ర్యాంక్‌ 108గాఉంది. 2006తో పోల్చితే ఇది పది స్థానాలు పడిపోయింది. 
►సంపన్న భారతీయుల విషయంలో కూడా స్త్రీలు బాగానే వెనకబడి ఉన్నారు. భారత్‌లో మొత్తం 119 మంది కుబేరులుండగా, వీరిలో స్త్రీల సంఖ్య 10% కూడా లేదు. కేవలం 9 మంది సంపన్న మహిళలే ఉన్నారు.

మాంద్యం లేదు.. కానీ.. ప్రపంచ వృద్ధిపై ఐఎంఎఫ్‌ చీఫ్‌ లగార్డ్‌   
అంతర్జాతీయ ఆర్థిక వృద్ధి ఏమంత ఆశావహంగా లేదని అంతర్జాతీయ ద్రవ్య నిధి(ఐఎమ్‌ఎఫ్‌) వెల్లడించింది.  అయితే ప్రస్తుతం తలెత్తిన సమస్యలు తక్షణ మాంద్యాన్ని సూచించడం లేదని ఐఎమ్‌ఎఫ్‌ చీఫ్‌ క్రిస్టీన్‌ లగార్డే వ్యాఖ్యానించారు. అయినప్పటికీ వృద్ధి సంబంధిత సమస్యల పరిష్కారానికి విధాన నిర్ణేతలు, ప్రభుత్వాలు సమగ్రమైన, సహకారాత్మకమైన తక్షణ చర్యలు తీసుకోవలసిన అవసరముందని ఆమె స్పష్టం చేశారు. అంతర్జాతీయ ఆర్థిక సదస్సు డబ్ల్యూఈఎఫ్‌సమావేశంలో మాట్లాడారు.  

సంస్కరణలకు తగిన సమయం.. 
వివిధ దేశాలు తమ ప్రభుత్వాల రుణ భారాలు తగ్గించేలా చర్యలు తీసుకోవాలని లగార్డే సూచించారు. గణాంకాల ఆధారంగా కేంద్రబ్యాంక్‌ల విధానాలు ఉండాలని, ఒడిదుడుకులను తట్టుకునేలా కరెన్సీ మారక విలువలుండాలని పేర్కొన్నారు. మౌలిక సదుపాయాల అభివృద్ధి, లేబర్‌ మార్కెట్‌ అంశాల్లో సంస్కరణలకు ఇదే తగిన సమయమని వివరించారు.

భారత కంపెనీలే ముందు... 
నాలుగో పారిశ్రామిక విప్లవం సంబంధిత సమస్యల పరిష్కారంలో ఇతర దేశాల కంపెనీల కంటే భారత కంపెనీలే ముందున్నాయని అంతర్జాతీయ కన్సల్టెన్సీ సంస్థ డెలాయిట్‌  పేర్కొంది. భవిష్యత్తులో తలెత్తే సమస్యలను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు ఉద్యోగులకు భారత కంపెనీలు తగిన శిక్షణనిస్తున్నాయని ‘డెలాయిట్‌ రెడీనెస్‌ రిపోర్ట్‌’  వెల్లడించింది.  

అత్యంత విశ్వసనీయ దేశాల్లో భారత్‌.. 
ప్రపంచ వ్యాప్తంగా అత్యంత విశ్వసనీయమైన దేశాల్లో ఒకటిగా భారత్‌ నిలిచిందని 2019  ఎడెల్‌మన్‌ ట్రస్ట్‌ బారోమీటర్‌ రిపోర్ట్‌ వెల్లడించింది. ప్రభుత్వం, వ్యాపారం, స్వచ్చంద సేవా సంస్థలు, మీడియా అంశాల పరంగా చూస్తే,  అత్యంత విశ్వసనీయ దేశాల్లో భారత్‌ ఒకటని పేర్కొంది. భారత్‌ బ్రాండ్లు మాత్రం అత్యంత స్వల్ప విశ్వసనీయ బ్రాండ్లుగా నిలిచాయి.  

ప్రతిభలో అంతంత మాత్రమే.. 
గ్లోబల్‌ టాలెంట్‌ కాంపిటీటివ్‌ ఇండెక్స్‌లో ఈ ఏడాది భారత్‌ ఒక స్థానం ఎగబాకి 80వ స్థానానికి చేరింది. ఇన్‌సీడ్‌ బిజినెస్‌ స్కూల్, టాటా కమ్యూనికేషన్స్, ఏడెక్కో గ్రూప్‌లు సంయుక్తంగా రూపొందించిన ఈ సూచీలో స్విట్జర్లాండ్‌ అగ్రస్థానంలో కొనసాగింది.

చైనా పాత్రను భర్తీ చేసేది మనమే... 
ప్రపంచ ఆర్థిక వృద్ధిలో చైనా పాత్రను భర్తీ చేయగలిగే సత్తా భవిష్యత్తులో భారత్‌కు ఉందని స్పైస్‌జెట్‌  సీఈఓ అజయ్‌ సింగ్‌ చెప్పారు. భారత్‌లో అధికారంలో ఎవరు ఉన్నా, ఆర్థిక విధానాలపై ఏకాభిప్రాయం ఉంటుందని, వృద్ధి జోరు కొనసాగుతుందని, భారత్‌కు ఉన్న వినూత్నమైన ప్రయోజనం ఇదేనని పేర్కొన్నారు. వృద్ధి జోరు కొనసాగుతుందని డబ్ల్యూఈఎఫ్‌ సమావేశంలో  చెప్పారు. 

మరిన్ని వార్తలు