జీడీపీ వృద్ధి అంచనాల్లో కోత! | Sakshi
Sakshi News home page

జీడీపీ వృద్ధి అంచనాల్లో కోత!

Published Mon, Dec 14 2015 9:20 AM

జీడీపీ వృద్ధి అంచనాల్లో కోత!

- డిసెంబర్ 18న పార్లమెంట్‌లో కేంద్రం మధ్యంతర ఆర్థిక నివేదిక సమీక్ష
- 8% దిగువకు తగ్గించే అవకాశం
 
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం ప్రస్తుత ఆర్థిక సంవత్సరపు జీడీపీ వృద్ధి అంచనాలను తగ్గించే అవకాశాలు కనిపిస్తున్నాయి. కేంద్రం డిసెంబర్ 18న పార్లమెంట్‌లో ప్రవేశపెట్టాలని భావిస్తోన్న మధ్యంతర ఆర్థిక నివేదిక సమీక్షలో ఈ విషయం వెల్లడికానుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరపు తొలి అర్ధ భాగపు చివరి నాటి ఆదాయ వ్యయాల విశ్లేషణల ఆధారంగా మధ్యంతర ఆర్థిక నివేదిక రూపకల్పన జరుగుతుంది. ఈ మధ్యంతర ఆర్థిక నివేదిక.. వృద్ధి అంచనాలు, వివిధ రంగాలు ఎదుర్కొంటున్న సవాళ్లు, స్థూల ఆర్థిక పరిస్థితులు వంటి తదితర అంశాలకు సంబంధించిన వివరాలను తెలియజేస్తుంది.
 
 కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రధాన ఆర్థిక సలహాదారు అరవింద్ సుబ్రమణియన్ నేతృత్వంలోని ఒక బృందం ఈ మధ్యంతర ఆర్థిక నివేదిక ముసాయిదాను రూపొందిస్తోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం భారత్ వృద్ధి రేటు 8.1-8.5 శాతంగా ఉండవచ్చని ముందస్తు బడ్జెట్ ఆర్థిక సర్వే ఇదివరకే పేర్కొంది. ఇక ఆర్‌బీఐ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం వృద్ధి రేటు 7.4 శాతంగా ఉంటుందని అంచనా వేసింది. కాగా మధ్యంతర ఆర్థిక నివేదిక ప్రకారం.. 2015-16కి సంబంధించి జీడీపీ వృద్ధి 8 శాతం దిగువనే ఉండవచ్చని సమాచారం. గ త ఆర్థిక సంవత్సరం భారత ఆర్థిక వృద్ధి 7.3 శాతంగా ఉంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి అర్ద భాగంలో జీడీపీ వృద్ధి 7.2 శాతంగా నమోదైంది. కాగా గత ఆర్థిక సంవత్సరం ఇదే సమయంలో జీడీపీ వృద్ధి రేటు 7.5 శాతం.

Advertisement
Advertisement