పెట్రోల్‌ ధర రూ.100 : బంకులు మూత పడతాయ్‌ 

19 Sep, 2018 11:27 IST|Sakshi
పెట్రోల్‌, డీజిల్‌ బంకు (ఫైల్‌ ఫోటో)

న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా పెట్రోల్‌, డీజిల్‌ ధరలు ఎక్కడా తగ్గేది లేకుండా.. పెరుగుతూనే ఉంది. కొత్త ఏడాది కానుకగా ప్రభుత్వం పెట్రోల్‌ను 100 రూపాయలకు అందించే అవకాశాలు కనిపిస్తున్నాయి. కొత్త ఏడాదికి దగ్గర దగ్గర 100 రోజుల సమయం ఉంది. ఈ వంద రోజుల్లో పెట్రోల్‌ కూడా 100 రూపాయలను దాటే అవకాశం కనిపిస్తోంది. దీంతో లీటరు పెట్రోల్‌ 100 రూపాయలను దాటిన రికార్డును 2019 సొంతం చేసుకోబోతుంది. 

పెట్రోల్‌, డీజిల్‌ ధరలు అలా పెరుగుకుంటూ వెళ్తూ.. 100 రూపాయలను క్రాస్‌ చేస్తే, పరిస్థితేంటి? అనే భయాందోళనలు కూడా పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి. సాధారణంగా పెట్రోల్‌ 100 రూపాయలు దాటితే, అవి పాత మిషన్లలో చూపించడం కష్టం. ఎందుకంటే, భారత్‌లో ఇంధనం సరఫరా చేసే మిషన్లు మూడు అంకెల ధరల విధానాన్ని సపోర్టు చేయడం లేదు. ఆక్టేన్‌ పెట్రోల్‌ ప్రస్తుతం లీటరు రూ.100.33గా నమోదవుతోంది. కానీ పెట్రోల్‌ బంకుల మిషన్లలో ఇది కేవలం 0.33గా మాత్రమే చూపిస్తోంది. దీంతో పెట్రోల్‌ పంపు ఆపరేటర్లు మాన్యువల్‌గా పెట్రోల్‌ ధరలను అప్‌డేట్‌ చేస్తున్నారు. ఒకవేళ నార్ముల్‌ పెట్రోల్‌ విషయంలోనూ అదే జరిగితే, మాన్యువల్‌ ధరలను నిర్వహించడం కుదరదు. అది సాధ్యం కాని పని కూడా.

పెట్రోల్‌ 100 రూపాయలు దాటిన తర్వాత మిషన్లను అప్‌డేట్‌ చేయడం ప్రారంభిస్తే, సరఫరా కష్టంగా మారుతుంది. అన్ని పెట్రోల్‌ పంపులు ఆటోమేటెడ్‌గా రన్‌ అవుతున్నాయి. సెట్రల్‌ సర్వర్‌లో మారిన తర్వాత నుంచే అన్ని సర్వర్లలో మారుతూ ఉంటాయి. ఇలా ధర పెరుగుకుంటూ పోతే మాత్రం, పెట్రోల్‌ పంపులు మూత పడి, అన్ని సౌకర్యాలు అమర్చుకున్న తర్వాతనే ప్రారంభమవుతాయి. మరి అప్పటి వరకు వాహనదారులు ఎక్కడికి పోవాలి. ఏ వాహనం కూడా రోడ్డెక్కని పరిస్థితి ఏర్పడుతోంది. అలా అయితే ఎలా? అనే వాదనలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం 80 శాతం పెట్రోల్‌ బంకులు పాత మిషన్లనే వాడుతున్నాయి. ఇప్పటికే ముంబైలో లీటరు పెట్రోల్‌ ధర రూ.90లను దాటేసింది. ప్రస్తుతం రూ.91.96 వద్ద నమోదవుతోంది. దీంతో కేంద్ర ప్రభుత్వానికి పెట్రోల్‌, డీజిల్‌ ధరల పెరుగుదల మరో కొత్త సవాల్‌ను సృష్టించింది. 

అంతర్జాతీయంగా క్రూడాయిల్‌ ధరలు పెరుగుదల, రూపాయి పాతాళానికి పడిపోవడం, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విధిస్తున్న పన్నులు పెట్రోల్‌, డీజిల్‌ ధరలను ఎక్కడా తగ్గనీయ కుండా పరుగులు పెట్టిస్తున్నాయి. అంతేకాకుండా... అమెరికా ఇరాన్‌పై విధిస్తున్న ఆంక్షలు భారత్‌కు చుక్కలు చూపిస్తోంది. సౌదీ అరేబియా, ఇరాక్‌ తర్వాత భారత్‌ ఎక్కువగా చమురు దిగుమతి చేసుకుంటున్న దేశంగా ఇరాన్‌ ఉంది. అయితే తాజాగా ట్రంప్‌ సర్కార్‌ ఇరాన్‌పై విధిస్తున్న ఆంక్షలు, భారత్‌, ఇరాన్‌ సంబంధాలను దెబ్బతీస్తున్నాయి. అంతేకాకుండా.. ఇరాన్‌ నుంచి చమురు దిగుమతి అయ్యే ట్యాంకర్లను అమెరికా ఆపివేస్తోంది. దీంతో భారత చమురు ఉత్పత్తుల మార్గాల్లో ఒకటైన ఇరాన్‌ నుంచి ఇంధన దిగుమతులు మూతపడనున్నాయి.

ఇరాన్‌పై రెండో దశ ఆంక్షలు నవంబర్‌ నుంచి అమల్లోకి వస్తున్నాయి. ఇప్పుడే పెట్రోల్‌, డీజిల్‌ ధరలు ఇంత చుక్కలు చూపిస్తుంటే, అదే రెండో దశ అమల్లోకి వచ్చాక పరిస్థితి మరింత దిగజారనుంది. ఇరాన్‌ విషయంలో అమెరికా అసలు మెత్తబడే అవకాశం కనిపించడం లేదు. దీంతో పెట్రోల్‌, డీజిల్‌ ధరల విషయంలో ప్రస్తుతం నడుస్తుందని ట్రయల్‌ మాత్రమేనని, వచ్చే ఏడాది నుంచి పెట్రోల్‌, డీజిల్‌ ధరలు వాహనదారులను మరింత చుక్కలు చూపించే అవకాశం ఉందని ఆర్థిక వేత్తలంటున్నారు. మరోవైపు పెట్రోల్‌, డీజిల్‌ను దేశీయంగా జీఎస్టీలోకి తేవాలనే ప్రతిపాదనను పాలకులు చాకచక్యంగా పక్కన పెట్టడం కూడా ప్రతికూలంగా నిలుస్తోంది. 

మరిన్ని వార్తలు