లీటరు పెట్రోల్‌పై కేంద్రానికి రూ.25 బొనాంజా

23 May, 2018 11:53 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: మండుతున్న పెట్రో ధరలపై  కాంగ్రెస్‌ నేత,  కేంద్ర మాజీ ఆర్థికమంత్రి చిదంబరం మరోసారి బీజేపీ ప్రభుత్వంపై మండిపడ్డారు.   దేశవ్యాప్తంగా ఆందోళన రేపుతున్న పెట్రో ధరలపై ఆయన  ట్విటర్‌లో  స్పందించారు. లీటరుకు ఒకటి లేదా రెండు రూపాయల చొప్పున ఇంధన ధరలను తగ్గించడం ద్వారా కేంద్ర ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తుందంటూ  కేంద్రంపై ధ్వజమెత్తారు.  తమ ఖజానా నింపుకునేందుకు సాధారణ ప్రజలపై కేంద్ర ప్రభుత్వమే ఆ భారాన్ని వేస్తోందని విమర్శించారు.   దీంతో కేం‍ద్ర ప్రభుత్వానికి లీటరుపై రూ. 25 బొనాంజా అంటూ బుధవారం ఆయన వరుస ట్వీట్లలో ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.

ప్రభుత్వం పూనుకుంటే లీటరుకు 25 రూపాయల దాకా తగ్గించే అవకాశం  ఉందని ట్విట్‌ చేశారు. ప్రస్తుతం ఢిల్లీలో లీటరు పెట్రోల్ రూ.77 ఉంది. అయితే ప్రతి లీటరు పెట్రోల్‌పై కేంద్ర ప్రభుత్వం సుమారు రూ.25 లాభం పొందుతోందన్నారు. క్రూడ్ ఆయిల్ ధరలు పడిపోయినప్పుడు ప్రతి లీటరు పెట్రోల్‌పై సుమారు రూ.15 కేంద్ర ప్రభుత్వం ఆదా చేస్తుందని,  ప్రతి లీటరు పెట్రోల్‌పై కేంద్ర ప్రభుత్వం రూ.10 అదనపు ట్యాక్స్‌ను విధిస్తుందని చిదంబరం తన ట్వీట్‌లో  పేర్కొన్నారు. తద్వారా  ప్రతి లీటరుపై రూ.25  కేంద్రానికి ఆదా అవుతుందని ఆయన తెలిపారు. ఆదా అయిన డబ్బు అంతా సగటు  వినియోగదారుడికే చెందాలని ఆయన వ్యాఖ్యానించారు.   కావాలంటే ప్రభుత్వం ప్రతి లీటరుపై సుమారు రూ.25 తగ్గించవచ్చు అని, కానీ ప్రభుత్వం అలా చేయదు, కేవలం ఒకటి లేదా రెండు రూపాయలు తగ్గిస్తూ ప్రజలను మోసం చేస్తుందని చిదంబరం విమర్శించారు.

మరిన్ని వార్తలు