'నాన్న బ్లడ్‌ బాయ్‌'! 71 ఏళ్ల తండ్రి వయసు ఏకంగా 25 ఏళ్లకు..

15 Nov, 2023 14:09 IST|Sakshi

టెక్‌ మిలినియర్‌ బ్రయాన్‌ జాన్సన్‌ బయోలాజికల్‌ ఏజ్‌ రివర్స్‌లో భాగంగా తనే ఏజ్‌ని తగ్గించడం కోసం ఎంతలా డబ్బును వెచ్చించాడో తెలిసిందే. ఇప్పుడూ ఏకంగా తన రక్తంతో వృద్ధాప్యంలో ఉన్న తన తండ్రి ఏజ్‌ని తగ్గించే ప్రక్రియకు పూనుకున్నాడు. అందుకు సంబంధించిన విషయాన్ని ట్విట్టర్‌లో షేర్‌ చేయడంతో నెట్టింట తెగ వైరల్‌గా మారింది. ఇంతకీ ఏంటా కథకమామీషు అంటే..

45 ఏళ్ల సాఫ్ట్‌వేర్‌ బిలియనీర్‌ బ్రయాన్‌ జాన్సన్‌ ఏజ్‌ తగ్గించుకునే ప్రయోగాలు తనకే పరిమితం చేయలేదు కాబోలు. అందుకోసం 71 ఏళ్ల తండ్రిని కూడా వదిలిపెట్టలేదు . జాన్సన్‌ తన తండ్రి కోసం సుమారు 1 లీటర్‌ ప్లాస్మా దానం చేసినట్లు తెలిపాడు. అతనికి తన శరీరంలో ఉన్న ప్లాస్మాను తీసివేసి కొడుకు రక్తంలోని ప్లాస్మాను ఎక్కించారు. దీంతో అతడి వృద్ధాప్య వయసు 25 ఏళ్లకు తగ్గింది. ఎంత పెద్దవారైతే అంత తొందరగా వృద్ధాప్యం వస్తుంది. అయితే ఎప్పుడైతే అతనికి కొడుకు జాన్సన్‌ ప్లాస్మా ఎక్కించారో అప్పుడే అతను 46 ఏళ్ల టైంలో వచ్చే వృద్ధాప్య వేగం వచ్చింది.

ఈ చికిత్స జరిగిన నెలలు తర్వాత కూడా అతడిలో అదే తరహా వృద్ధాప్య లక్షణాలు కనిపించాయని జాన్సన్‌ ట్విట్టర్‌లో చెప్పుకొచ్చాడు. తాను ఇప్పుడు మా నాన్న "బ్లడ్‌ బాయ్‌"ని అంటూ అసలు విషయం అంతా రాసుకొచ్చాడు. ఈ ప్రక్రియలో తన తండ్రి కొన్ని జాగ్రత్తలు పాటించాల్సి ఉందన్నాడు. అలాగే తన నుంచి పొందిన లీటరు రక్తం కంటే ఎక్కువగానే తన తండ్రిలోని సొంత ప్లాస్మాను తీసేసి ఉండొచ్చు అందువల్లే తన తండ్రిలో ఇంతలా మార్పులు వచ్చాయని అంటున్నాడు.

కాగా, జాన్సన్‌ గత ఫిబ్రవరి ప్రాజెక్ట్‌ బ్లూప్రింట్‌లో భాగంగా తన యవ్వనాన్ని తిరిగి పొందేందుకు రోజు వందకు పైగా మందులు వేసుకుంటున్నాని, దాదాపు 30 మంది వైద్యులచే నిరంతరం వైద్య పరీక్షలు చేయించుకుంటున్నట్లు చెప్పుకొచ్చాడు. పైగా అందుకోసం ఏడాదికి రూ. 16 కోట్లు పైనే ఖర్చు చేస్తున్నట్లు చెప్పాడు. ఈ రివర్స్‌ ఏజింగ్‌ ప్రయోగం సఫలం అవుతుందో లేదో తెలియదు గానీ అందుకోసం వారు తీసుకుంటున్న చికిత్సలు, పడుతున్న అవస్థలు వింటుంటే వామ్మో!.. అనిపిస్తుంది కదూ.

(చదవండి: వ్యాయామం రోజూ ఒకే టైంలో చేస్తున్నారా? వెలుగులోకి షాకింగ్‌ విషయాలు)


 

మరిన్ని వార్తలు