పోస్టల్ ద్వారా ప్రభుత్వ సర్వీసులు

8 Jan, 2015 01:08 IST|Sakshi
పోస్టల్ ద్వారా ప్రభుత్వ సర్వీసులు

* ఎకానమీని పరుగెత్తించే సత్తా పోస్టల్ శాఖకు ఉంది...
* ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వ్యాఖ్యలు

న్యూఢిల్లీ: రైల్వేస్ తరహాలోనే భారీ స్థాయిలో విస్తరించిన పోస్టల్ వ్యవస్థ దేశ ఎకానమీకి చోదక శక్తిగా నిలవగలదని ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు. మారుమూల ప్రాంతాల్లో ప్రజలకు కూడా ప్రభుత్వ సేవలు, సమాచారం అందేలా చూసేందుకు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న పోస్టాఫీసులు ఎంతగానో ఉపయోగపడగలవని ఆయన బుధవారం తెలిపారు.

పోస్టల్ విభాగానికి దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉన్న వనరులు, ఆస్తులను ప్రజోపయోగకర పనులకు ఉపయోగించుకోవచ్చని ఆయన పేర్కొన్నారు. పోస్టల్ నెట్‌వర్క్‌ను మరింత  సమర్థంగా వినియోగించుకునే అంశంపై టాస్క్‌ఫోర్స్ నివేదిక సమర్పించిన సందర్భంగా మోదీ ఈ విషయాలు చెప్పారు.  ఇందులో భాగంగా టాస్క్‌ఫోర్స్ సిఫార్సులను సత్వరం అధ్యయనం చేసి, అమల్లోకి తేవాలని అధికారులను ఆదేశించారు. కేంద్ర కమ్యూనికేషన్, ఐటీ శాఖ మంత్రి రవి శంకర్ ప్రసాద్ సమక్షంలో టాస్క్‌ఫోర్స్ చైర్మన్ టీఎస్‌ఆర్ సుబ్రమణ్యన్ నివేదికలో ముఖ్యాంశాల గురించి ప్రధానికి వివరించారు.
 
అందరికీ ఆర్థిక సేవలు అందుబాటులోకి తెచ్చేందుకు, ఇతరత్రా సేవలను అందించేందుకు ఇండియా పోస్ట్‌ను ఏ విధంగా ఉపయోగించుకోవచ్చన్న అంశంపై మోదీ గతేడాది ఈ టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేశారు. టాస్క్‌ఫోర్స్ నివేదిక ప్రకారం డిపాజిట్ల విషయంలో ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్‌బీఐ తర్వాత ఏకంగా రూ. 6 లక్షల కోట్లతో ఇండియా పోస్ట్ రెండో స్థానంలో ఉంది. దాదాపు 1.55 లక్షల సిబ్బంది ఉన్నారు. ఈ నేపథ్యంలో ఈ వనరులను సమర్థంగా ఉపయోగించుకునేందుకు, వివిధ సేవలను అందించేందుకు పోస్టల్ డిపార్ట్‌మెంట్ కింద హోల్డింగ్ కంపెనీని ఏర్పాటు చేయాలని టాస్క్‌ఫోర్స్ సూచించింది.
 
హోల్డింగ్ కంపెనీ స్వరూపం ఇలా..
హోల్డింగ్ కంపెనీలో అయిదు విభాగాలు ఉండొచ్చని టాస్క్‌ఫోర్స్ పేర్కొంది. ఇందులో బ్యాంకింగ్, బీమా, ఈ-కామర్స్ విభాగాలు తక్షణమే కార్యకలాపాలు ప్రారంభించవచ్చని తెలిపింది. బ్యాంకింగ్ తర్వాత అత్యధికంగా ఈ-కామర్స్ రంగంలో భారీ అవకాశాలు ఉన్నందున పోస్టల్ విభాగం వీటిని అందిపుచ్చుకోవాలని సూచించింది.

ఇక పోస్ట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పేరిట ప్రత్యేకంగా మరో సంస్థను నెలకొల్పాలని తెలిపింది. తొలి మూడేళ్లలో జిల్లాకి ఒక శాఖ చొప్పున ఏర్పాటు చేయొచ్చని వివరించింది. దీనికి ప్రభుత్వం ప్రారంభంలో రూ. 500 కోట్లు మూలనిధిని సమకూర్చాలని సూచించింది. తద్వారా అందరికీ ఆర్థిక సేవలు అందుబాటులోకి తెచ్చే క్రమంలో ఇటు పోస్ట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, అటు జనధన యోజన కీలక పాత్ర పోషించగలవని తెలిపింది.

మరిన్ని వార్తలు