Lakshya Sen: ప్రధాని మోదీ సహాయం కోరిన బ్యాడ్మింటన్‌ స్టార్‌

8 Nov, 2023 17:23 IST|Sakshi

Badminton Star Lakshya Sen Seeks PM Modi's Help: భారత బ్యాడ్మింటన్‌ స్టార్‌, కామన్‌వెల్త్‌ గేమ్స్‌-2022 స్వర్ణ పతక విజేత లక్ష్య సేన్‌ ప్రధాని నరేంద్ర మోదీ సహాయం కోరాడు. కీలక టోర్నీలు ముందున్న వేళ వీసా జాప్యం వల్ల ఎదురవుతున్న ఇబ్బందుల గురించి కేంద్ర పెద్దల దృష్టికి తీసుకువెళ్లాడు.

కాగా నవంబరులో రెండు ప్రతిష్టాత్మక బ్యాడ్మింటన్‌ టోర్నమెంట్లు జరుగనున్నాయి. నవంబరు 14- 19 వరకు జపాన్‌ మాస్టర్స్‌, నవంబరు 21- 26 వరకు షెంజన్‌ వేదికగా చైనా మాస్టర్స్‌ టోర్నీ నిర్వహణకు షెడ్యూల్‌ ఖరారైంది.

ఇక వరల్డ్‌ నంబర్‌ 17 లక్ష్య సేన్‌తో పాటు మిగిలిన భారత షట్లర్లు కూడా ఈ టోర్నీలు ఆడేందుకు సిద్ధం కాగా.. వీసా సమస్యలు తలెత్తాయి. ఈ నేపథ్యంలో ఎక్స్‌(ట్విటర్‌) వేదికగా లక్ష్య సేన్‌ తమ ఇబ్బందులను వెల్లడించాడు. 

నాతో పాటు నా టీమ్‌కి కూడా
‘‘జపాన్‌, చైనా ఓపెన్‌ ఆడేందుకు నేను ప్రయాణం కావాల్సి ఉంది. నాతో పాటు నా టీమ్‌ కూడా ఇందుకోసం అక్టోబరు 30న జపాన్‌ వీసా కోసం అప్లై చేసింది. కానీ ఇంతవరకు వీసా మంజూరు కాలేదు.

చైనా వీసా కోసం కూడా మేము దరఖాస్తు చేయాల్సి ఉంది. నాతో పాటు మా కోచ్‌, ఫిజియో వీసా సమస్యల విషయంలో జోక్యం చేసుకుని తక్షణమే పరిష్కారం చూపాల్సిందిగా అభ్యర్థిస్తున్నా’’ అని  ప్రధాని కార్యాలయం, విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్‌.జైశంకర్‌తో పాటు క్రీడా మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌కు లక్ష్య సేన్‌ విజ్ఞప్తి చేశాడు.
 

మరిన్ని వార్తలు