ప్రాఫిట్ బుకింగ్: లాభాలకు బ్రేక్

27 Apr, 2017 16:21 IST|Sakshi
అలుపెరగకుండా రికార్డుల మోత మోగించిన మార్కెట్లకు బ్రేక్ పడింది. మార్కెట్లో ప్రాఫిట్ బుకింగ్ చోటు చేసుకుంది. దీంతో గురువారం ట్రేడింగ్ లో స్టాక్ మార్కెట్లు నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 103.61 పాయింట్ల నష్టంలో 30029.74 వద్ద, నిఫ్టీ 9.70 పాయింట్ల నష్టంలో 9342.15 వద్ద క్లోజ్ అయ్యాయి. లుపిన్, అరబిందో ఫార్మా, ఐటీ టాప్ లూజర్లుగా నష్టాలు గడించగా.. టాటా మోటార్స్, ఇన్ఫోసిస్, యస్ బ్యాంకు, ఏసీసీ లాభాల్లో నడిచాయి. ఆటో దిగ్గజం మారుతీ సుజుకీ సాధారణ ఫలితాలను ప్రకటించిన తర్వాత కంపెనీ షేరు స్వల్పంగా పడిపోయింది. మంచి లాభాల్లో అదరగొట్టిన కొటక్ మహింద్రా బ్యాంకు షేరు లాభాల్లో ముగిసింది. 
 
ఏప్రిల్ నెల ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్ల గడువు నేటితో ముగియడంతో పాటు, గత మూడు రోజులుగా జరిపిన రికార్డు లాభాలతో మార్కెట్లో ప్రాఫిట్ బుకింగ్ చోటుచేసుకుందని మార్కెట్ విశ్లేషకులంటున్నారు. డొనాల్డ్ ట్రంప్ బుధవారం విడుదల చేసిన ట్యాక్స్ కట్ ప్లాన్ కూడా పెట్టుబడిదారులను ఆకట్టుకోవడంలో విఫలమైంది. దీంతో  ఆసియన్ షేర్లలోనూ జోరు తగ్గింది. అటు డాలర్ తో రూపాయి మారకం విలువ కూడా 3 పైసలు బలహీనపడి 64.14 వద్ద ముగిసింది. ఎంసీఎక్స్ మార్కెట్లో బంగారం ధరలు 43 రూపాయల లాభంతో 28,762 రూపాయలుగా నమోదయ్యాయి.    
 
మరిన్ని వార్తలు