సిట్రోన్‌ కార్లతో పీఎస్‌ఏ గ్రూప్‌ రీఎంట్రీ

27 Feb, 2019 00:15 IST|Sakshi

2021 ఆఖరు నాటికి మార్కెట్లోకి తొలి మోడల్‌ 

న్యూఢిల్లీ: యూరోపియన్‌ ఆటోమొబైల్‌ దిగ్గజం పీఎస్‌ఏ గ్రూప్‌ తాజాగా భారత మార్కెట్లో రీఎంట్రీ కోసం సిట్రోన్‌ బ్రాండ్‌ కార్లను ఎంచుకుంది. 2021 ఆఖరుకి తొలి మోడల్‌ను ప్రవేశపెట్టాలని యోచిస్తోంది. 2018–19 ఆర్థిక ఫలితాల వెల్లడి సందర్భంగా పీఎస్‌ఏ గ్రూప్‌ చైర్మన్‌ కార్లోస్‌ టెవారెస్‌ ఈ విషయాలు తెలిపారు. ‘ సిట్రోన్‌ బ్రాండ్‌ ద్వారా భారత మార్కెట్లో మళ్లీ ప్రవేశించాలని నిర్ణయించాం. ఇందుకోసం ఇప్పటికే పెట్టుబడులు కూడా పెట్టాం. భారత్‌లో తయారీ ప్లాంట్‌ కూడా ఏర్పాటు చేశాం. ప్రస్తుతం ఒక పవర్‌ ట్రెయిన్‌ ప్లాంటు, వాహనాల తయారీ ప్లాంటు ఉంది. ఒక సంస్థతో భాగస్వామ్యం కుదుర్చుకున్నాం.

కొత్త బ్రాండ్‌ను ప్రవేశపెట్టేందుకు అవసరమైన నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేసుకుంటున్నాం‘ అని ఆయన తెలిపారు. భారత మార్కెట్లో సీకే బిర్లా గ్రూప్‌తో పీఎస్‌ఏ గ్రూప్‌ 2017లో భాగస్వామ్య ఒప్పందం కుదుర్చుకుంది. తమిళనాడులో వాహన, పవర్‌ట్రెయిన్‌ తయారీ ప్లాంట్ల ఏర్పాటు కోసం 100 మిలియన్‌ యూరోలు కేటాయించింది. పీఎస్‌ఏ గ్రూప్‌ అంతర్జాతీయంగా ప్యుజో, సిట్రోన్, డీఎస్‌ అనే మూడు బ్రాండ్స్‌ కింద వాహనాలు విక్రయిస్తోంది. గతంలో భారత్‌లో ప్రీమియర్‌ సంస్థతో ఒప్పందం ద్వారా కార్లను విక్రయించింది. కానీ 2001లో జాయింట్‌ వెంచర్‌ నుంచి తప్పుకుంది. ఆ తర్వాత పలు దఫాలుగా మళ్లీ భారత మార్కెట్లోకి ప్రవేశించే ప్రయత్నాలు చేసినా సాధ్యపడలేదు. 2011లో మధ్య స్థాయి సెడాన్‌ కారుతో రీఎంట్రీ ఇవ్వాలని భావించినప్పటికీ కుదరలేదు. 

మరిన్ని వార్తలు