పీఎస్‌బీలకు నిర్వహణ స్వేచ్ఛ ఉండాలి

25 Aug, 2018 00:56 IST|Sakshi

ప్రైవేట్‌ బ్యాంకుల స్థాయిలో ఇవ్వాలి: బీవోఐ చైర్మన్‌ పద్మనాభన్‌

న్యూఢిల్లీ: ప్రైవేట్‌ బ్యాంకుల స్థాయిలోనే ప్రభుత్వ రంగ బ్యాంకులకూ (పీఎస్‌బీ) నిర్వహణాపరమైన స్వేచ్ఛ ఉండాలని బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (బీవోఐ) నాన్‌ ఎగ్జిక్యూటివ్‌ చైర్మన్‌ జి. పద్మనాభన్‌ చెప్పారు. అప్పుడే మొండిబాకీలు సహా పలు సమస్యలను పీఎస్‌బీలు వాటంతట అవే పరిష్కరించుకోగలవని ఆయన తెలిపారు. సెంటర్‌ ఫర్‌ ఎకనమిక్‌ పాలసీ రీసెర్చ్‌ (సీఈపీఆర్‌) నిర్వహించిన బ్యాంకింగ్‌ సదస్సులో శుక్రవారం పాల్గొన్న సందర్భంగా పద్మనాభన్‌ ఈ విషయాలు చెప్పారు. ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో భారీగా మొండిబాకీలు పేరుకుపోయిన నేపథ్యంలో పద్మనాభన్‌ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.  

బ్యాంకింగ్‌ రంగంలో చాలా మటుకు సమస్యలు నిర్వహణపరమైన అంశాలే తప్ప యాజమాన్యపరమైనవి కావని ఆయన పేర్కొన్నారు. ‘యాజమాన్య అధికారాలపరంగా పీఎస్‌బీలకు కొన్ని పరిమితులు ఉన్నాయి.. అయితే వీటిని సులువుగానే పరిష్కరించుకోవచ్చు. అయితే, నిర్వహణ విషయంలో స్వేచ్ఛగా వ్యవహరించేందుకు ప్రైవేట్‌ రంగ బ్యాంకుల స్థాయిలోనే ప్రభుత్వ రంగ బ్యాంకులకు కూడా వెసులుబాటు ఉండాలి‘ అని పద్మనాభన్‌ చెప్పారు.  

బీవోఐ విషయానికొస్తే తమ మొండిబాకీల్లో చాలా మటుకు రుణాలు ఇన్‌ఫ్రా రంగం నుంచి రావాల్సినవేనని ఆయన తెలిపారు. తమది లీడ్‌ బ్యాంక్‌ కాకపోయినా.. ఇవన్నీ కన్సార్షియంలో భాగంగా ఇచ్చిన రుణాలేనని, ప్రభుత్వ రంగ బ్యాంకులు ఇలాంటి సమస్యలే ఎదుర్కొంటున్నాయని చెప్పారు. గతేడాది డిసెంబర్‌ ఆఖరు నాటికి బ్యాంకింగ్‌ రంగంలో మొండిబాకీలు రూ. 8.31 లక్షల కోట్లకు పెరిగిన సంగతి తెలిసిందే. 2017–18 ఆర్థిక సంవత్సరంలో మొత్తం 21 పీఎస్‌బీల్లో రెండు మినహా.. 19 బ్యాంకులు ఏకంగా రూ. 87,357 కోట్ల నష్టాలను ప్రకటించాయి. విజయా బ్యాంక్, ఇండియన్‌ బ్యాంక్‌ మాత్రమే లాభాలు నమోదు చేశాయి.

మరిన్ని వార్తలు