ఎయిర్‌టెల్‌కు ఖతార్‌ షాక్‌

8 Nov, 2017 16:54 IST|Sakshi

సాక్షి, ముంబై: దేశీయ టెలికాం దిగ్గజం  భారతి ఎయిర్టెల్ కు  వాటా విక్రయం షాక్‌ తగిలింది. ఖతార్‌కు చెందిన  బిగ్‌ ఇన్వెస్టర్‌ భారతికి చెందిన భారీవాటాను  విక్రయించనున్నారన్న వార్తలతో  బుధవారం నాటి మార్కెట్లో  భారతి ఎయిర్‌టెల్‌ టాప్‌ లూజర్‌గా నిలిచింది.  భారతీ ఎయిర్టెల్‌ షేర్లు 3.4 శాతం క్షీణించి రూ .514.35 వద్ద ముగిశాయి.

ఖతార్‌  ఫౌండేషన్  అనుబంధ సంస్థ  త్రి పిల్లర్స్‌ లిమిటెడ్‌ భారతి ఎయిర్టెల్ లిమిటెడ్లో 5 శాతం వాటాను విక్రయించాలని యోచిస్తోంది. ఈ బ్లాక్ డీల్‌  ద్వారా 9,500 కోట్ల (1.46 బిలియన్ డాలర్లు) విలువైన షేర్లను  విక్రయించనుంది. 1999 మిలియన్ షేర్లను మార్కెట్ లావాదేవీల ద్వారా విక్రయించాలని నిర్ణయించింది.  షేర్‌ ధర రూ.473-490 గా ఉండనుంది.  2013లో  వీటిని రూ.340 వద్ద కొనుగోలు చేసింది.
అటు ఖతర్ ఫౌండేషన్‌ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ రషీద్ ఫహాద్ అల్ నోయిమి భారతి ఎయిర్టెల్ బోర్డులో ఉన్నారు. అయితే ఈ పరిణామాలపై స్పందించేందుకు భారతి ఎయిర్‌టెల్‌ నిరాకరించింది.

కాగా  ఉగ్రవాదానికి మద్దతిస్తోందన్న ఆరోపణలతో ఖతార్‌తో సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, బహ్రెయిన్, ఈజిప్ట్ దేశాలు   దౌత్య సంబంధాలను తెగ తెంపులు చేసుకున్నాయి.దీంతో ఖతార్‌ ఆర్థిక వ్యవస్థపై ఒత్తిడిని నివారించే వ్యూహంతో  అక్కడి కంపెనీలు విదేశాల్లో తమ పెట్టుబడులను ఉపసంహరించుకుంటున్నాయి. గల్ఫ్ దేశాలు ఈ ఏడాది జూన్ 5 న దోహాతో దౌత్య మరియు రవాణా సంబంధాలను కట్ చేసిన సంగతి తెలిసిందే.
 

మరిన్ని వార్తలు