‘వడ్డిం’పులు తగ్గించరేం..?

12 Mar, 2019 00:51 IST|Sakshi

ఆర్‌బీఐ వరమిచ్చినా  కరుణించని బ్యాంకులు

తగ్గిస్తున్నది తక్కువ... అందులోనూ జాప్యం

డిపాజిట్ల వృద్ధి అంతంతే... పోస్టాఫీస్‌ పథకాలతో 

పోటీపడాల్సి రావటమే కారణం  

ముంబై: వృద్ధికి ఊతమిచ్చే దిశగా రిజర్వ్‌ బ్యాంక్‌ కీలక పాలసీ రేట్లను తగ్గించినప్పటికీ .. బ్యాంకులు ఆ ప్రయోజనాలను పూర్తి స్థాయిలో రుణ గ్రహీతలకు బదలాయించడం లేదు. ఆర్‌బీఐ గణాంకాల ప్రకారం ఈ ఏడాది తొలినాళ్ల నుంచి రుణాలపై బ్యాంకులు వసూలు చేసే వడ్డీ రేట్లు 8.15 – 8.55 శాతం శ్రేణిలో ఉంటున్నాయి. ఆర్‌బీఐ గత నెల 25  బేసిస్‌ పాయింట్ల మేర రెపో రేటును తగ్గించినప్పటికీ.. చాలా మటుకు బ్యాంకులు నామమాత్రంగా పది బేసిస్‌ పాయింట్ల దాకా తగ్గించి ఊరుకున్నాయి. పరపతి విధానానికి అనుగుణంగా బ్యాంకులు వడ్డీ రేట్లను తగ్గించేలా చూసేందుకు  ఆర్‌బీఐ కొత్త గవర్నర్‌ శక్తికాంత దాస్‌ కూడా బ్యాంకర్లతో చర్చలను జరుపుతున్నప్పటికీ.. పూర్తి స్థాయిలో ఫలితాలు కనిపించడం లేదు. బ్యాంకులు మరింత అధికంగా రేట్ల కోత ప్రయోజనాలు రుణగ్రహీతలకు అందించాలంటే రిజర్వ్‌ బ్యాంక్‌ పాలసీ రేటును మరింత భారీ స్థాయిలో తగ్గించాల్సి ఉంటుందని బ్యాంకింగ్‌ వర్గాలు అంటున్నాయి.   

రిజర్వ్‌ బ్యాంక్‌ ఫిబ్రవరిలో 25 బేసిస్‌ పాయింట్ల మేర తగ్గించడంతో రెపో రేటు 6.25 శాతానికి వచ్చి చేరింది. అయితే, రుణాలపై వడ్డీ రేట్ల మీద గణనీయ ప్రభావం చూపాలంటే ఇది సరిపోదని, ఇంతకన్నా అధిక స్థాయిలో రేట్ల కోత అవసరమని బ్యాంకులు చెబుతున్నాయి. ఆర్‌బీఐ సాధారణ స్థాయికి మించి 50 బేసిస్‌ పాయింట్ల కన్నా ఎక్కువగా రేటు తగ్గిస్తే ఏమైనా ఉపయోగం ఉంటుందని బ్యాంకర్లు అంటున్నారు. అలాఅయితేనే తాము మరింత వేగంగా వడ్డీ రేట్ల కోత ప్రయోజనాలను బదలాయించడానికి వీలవుతుందని చెబుతున్నారు. సాధారణంగా భారత్‌లో రెపో రేటు మార్పు ప్రభావాలు క్షేత్ర స్థాయిలో కనిపించేందుకు 6–9 నెలల సమయం పడుతుంది. రెపో రేటు సుమారు 25 బేసిస్‌ పాయింట్లు మారితే బ్యాంకు ఫ్లోటింగ్‌ రేటు దాదాపు 7–10 బేసిస్‌ పాయింట్ల మేర మారుతుందని ఎస్‌బీఐ వర్గాలు వెల్లడించాయి. ప్రభుత్వ రంగ బ్యాంకింగ్‌ దిగ్గజం ఎస్‌బీఐ ఈ మధ్యే కొన్ని కేటగిరీ డిపాజిట్లు, స్వల్ప కాలిక రుణాలపై వడ్డీ రేట్లను రెపో రేటుకు అనుసంధానించింది.  

బ్యాంకులు చెబుతున్న కారణాలేంటంటే.. 
డిపాజిట్లు, రుణాల వృద్ధి మధ్య వ్యత్యాసం, పోస్టాఫీస్‌ చిన్న మొత్తాల పథకాల నుంచి భారీగా పోటీ ఉంటుండటం వంటి కారణాలతో పాలసీ రేట్ల తగ్గింపు ప్రయోజనాలను తాము తక్షణం బదలాయించలేకపోతున్నామని బ్యాంకులు చెబుతున్నాయి. పాలసీ రేట్లు తక్కువగా ఉన్నా.. చిన్న మొత్తాల పొదుపు ఖాతాలపై బ్యాంక్‌ డిపాజిట్‌ రేట్లను మించి ప్రభుత్వం వడ్డీ ఇస్తోందని గోల్డ్‌మన్‌ శాక్స్‌ ఇండియా సెక్యూరిటీస్‌ చీఫ్‌ ఇండియా ఎకానమిస్ట్‌ ప్రాచీ మిశ్రా తెలిపారు. పోస్టాఫీస్‌ పథకాలపై వార్షికంగా 7 – 8 శాతం వడ్డీ రేటుతో పాటు పన్ను ప్రయోజనాలు కూడా లభిస్తున్నాయి. అదే ప్రభుత్వ రంగ దిగ్గజం ఎస్‌బీఐలో రెండేళ్ల టర్మ్‌ డిపాజిట్‌పై వడ్డీ రేటు 6.8 శాతంగానే ఉంటోంది. ఇక బ్యాంకులు మంజూరు చేస్తున్న రుణాల వృద్ధి కన్నా డిపాజిట్ల వృద్ధి చాలా మందగతిన ఉంటోంది. రుణ వృద్ధికి దీటుగా డిపాజిట్ల సమీకరణ కోసం బ్యాంకులు అధిక వడ్డీ రేట్లను ఆఫర్‌ చేయాల్సి వస్తోంది. ఫిబ్రవరి నాటికి రిజర్వ్‌ బ్యాంక్‌ గణాంకాల ప్రకారం వార్షిక ప్రాతిపదికన బ్యాంకుల రుణాల వృద్ధి 14% నమోదు కాగా.. డిపాజిట్ల వృద్ధి మాత్రం 10%గానే ఉంది. ఇలా రుణ, డిపాజిట్ల వృద్ధి మధ్య భారీ వ్యత్యాసం ఉన్నంత కాలం .. ఆర్‌బీఐ పాలసీ రేట్ల కోత ప్రయోజనాల బదలాయింపు పాక్షికమేనని, పైగా జాప్యాలు తప్పవని బ్యాంకర్లు పేర్కొన్నారు. బ్యాంకులు ఇప్పటికే మొండిబాకీలు, కఠిన ఆంక్షలతో సతమతమవుతున్న నేపథ్యంలో ఈ సమస్య అంత త్వరగా పరిష్కారం కాకపోవచ్చని తెలిపారు. ‘డిపాజిట్లు సమీకరించుకోవాలంటే అధిక వడ్డీ రేట్లు ఆఫర్‌ చేయాలి. అలాంటప్పుడు రుణాలపై వడ్డీ రేట్లను తగ్గించడానికి కుదరదు. ఆర్‌బీఐ పాలసీ రేట్ల కోత ప్రయోజనాలను బదలాయింపునకు సంబంధించి చిక్కంతా ఇక్కడే వస్తోంది‘ అని ఫెడరల్‌ బ్యాంక్‌ సీఎఫ్‌వో ఆశుతోష్‌ ఖజూరియా వ్యాఖ్యానించారు.

ఏప్రిల్‌ తర్వాత  తగ్గొచ్చన్న అంచనాలు.. 
ద్రవ్యోల్బణం ప్రస్తుత స్థాయిల్లోనే కొనసాగిన పక్షంలో వచ్చే ఆర్థిక సంవత్సరంలో (ఏప్రిల్‌ తర్వాత) రేట్లు మరింత తగ్గొచ్చన్న అంచనాలు నెలకొన్నాయి. ద్రవ్యోల్బణం తగ్గుముఖం పట్టడం, బలహీన డిమాండ్‌ కారణం గా వడ్డీ రేట్లను తగ్గించాలంటూ డిమాండ్లు వస్తున్నాయి. ప్రస్తుతం ద్రవ్యోల్బణం 2 శాతం స్థాయిలో ఉంటోంది. ఇది రిజర్వ్‌ బ్యాంక్‌ మధ్యకాలికంగా నిర్దేశించుకున్న 4%లో సగం. మంగళవారం విడుదలయ్యే తాజా గణాంకాల ప్రకారం ద్రవ్యోల్బణం 2.4 శాతంగా ఉండొచ్చన్న అంచనాలు నెలకొన్నాయి. 

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా