-

భారత్‌ వృద్ధి స్పీడ్‌ 6.4 శాతం

28 Nov, 2023 01:23 IST|Sakshi

న్యూఢిల్లీ: భారత్‌ 2023–24 స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి అంచనాలను ఎస్‌అండ్‌పీ గ్లోబల్‌ రేటింగ్స్‌ భారీగా 40 బేసిస్‌ పాయింట్లు (0.4%) పెంచింది. దీనితో ఈ అంచనా 6 శాతం నుంచి 6.4 శాతానికి పెరిగింది. అధిక ఆహార ద్రవ్యోల్బణం, బలహీన ఎగుమతి పరిస్థితులు ఉన్నప్పటికీ దేశీయ ఆర్థిక క్రియాశీలత, డిమాండ్‌ పటిష్టంగా ఉన్నాయని తన తాజా ఎకనమిక్‌ అవుట్‌లుక్‌ ఫర్‌ ఆసియా పసిఫిక్‌ నివేదికలో పేర్కొంది.

తమ అంచనాల అప్‌గ్రేడ్‌కు ఈ అంశాలు కారణాలుగా వివరించింది. అయితే 2024–25 అంచనాలను మాత్రం క్రితం 6.9 శాతం నుంచి 6.4 శాతానికి తగ్గిస్తున్నట్లు ఎస్‌అండ్‌పీ పేర్కొంది. అధిక బేస్‌ ఎఫెక్ట్, గ్లోబల్‌ వృద్ధిపై బలహీన అంచనాలు, వడ్డీరేట్ల పెంపు ప్రతికూలతలు వచ్చే ఆర్థిక సంవత్సరం వృద్ధి తీరుపై ప్రభావం చూపుతాయని అభిప్రాయపడింది.

ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ప్రపంచబ్యాంక్, అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్‌), ఏడీబీ, ఫిచ్‌ అంచనాలకన్నా (6.3 శాతం) ఎస్‌అండ్‌పీ తాజా అంచనాలు కొంచెం అధికంగా ఉండడం గమనార్హం. 2023 మార్చితో ముగిసిన 2022–23 ఆర్థిక సంవత్సరంలో భారత్‌ వృద్ధి 7.2 శాతంగా నమోదయిన సంగతి తెలిసిందే. కాగా, భారత్‌తో పాటు ఇండోనేíÙయా, మలే షియా, ఫిలిప్పైన్స్‌లో దేశీయ డిమాండ్‌ పటిష్టంగా ఉందని ఎస్‌అండ్‌పీ నివేదిక పేర్కొంది.

మరిన్ని వార్తలు