రూపాయి ఒత్తిళ్లు తగ్గితేనే వడ్డీ రేట్లు తగ్గుతాయి

30 Jun, 2013 06:58 IST|Sakshi
C Rangarajan

న్యూఢిల్లీ: రూపాయి క్షీణత ఒత్తిళ్లు తగ్గితేనే వడ్డీ రేట్లను తగ్గించేందుకు రిజర్వ్ బ్యాంకుకు (ఆర్‌బీఐ) వెసులుబాటు లభిస్తుందని ప్రధాని ఆర్థిక సలహా మండలి చైర్మన్ సి. రంగరాజన్ తెలిపారు. క్రితంసారి పాలసీ సమీక్ష సమయంలో.. టోకు ధరల ఆధారిత ద్రవ్యోల్బణం, ఆహారేతర తయారీ ఉత్పత్తుల ద్రవ్యోల్బణం తక్కువగా ఉన్నప్పటికీ.. రూపాయి క్షీణత వల్ల ఆర్‌బీఐ వడ్డీ రేట్ల తగ్గింపు జోలికి పోలేదని చెప్పారు.
 
 స్టాటిస్టిక్స్ డేని పురస్కరించుకుని ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా రంగరాజన్ ఈ విషయాలు తెలిపారు. రూపాయి గణనీయంగా పతనమైనప్పటి కీ.. గత రెండు రోజుల్లో చాలా మటుకు కోలుకుందని భావిస్తున్నట్లు ఆయన చెప్పారు. విదేశీ నిధులు మళ్లీ రాగలవని, ఫలితంగా రూపాయి మరింత బలం పుంజుకోగలదని రంగరాజన్ వివరించారు. విదేశీ నిధులు భారీగా తరలిపోతుండటంతో డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ ఆల్‌టైమ్ కనిష్టమైన 60 స్థాయి పైచిలుకు పడిపోయిన సంగతి తెలిసిందే. అయితే, శుక్రవారం మళ్లీ కాస్త కోలుకుని శుక్రవారం 59.39 వద్ద ముగిసింది. అమెరికా ఫెడరల్ రిజర్వ్ ఉద్దీపన ప్యాకేజీలను ఉపసంహరించకపోవచ్చన్న అంచనాల కారణంగా విదేశీ నిధులు తిరిగి వస్తున్న సంకేతాలు ఇందుకు దోహదపడ్డాయి. రూపాయి క్షీణత నేపథ్యంలో ఈ నెల ప్రారంభంలో త్రైమాసిక మధ్యంతర పాలసీ సమీక్ష నిర్వహించిన ఆర్‌బీఐ కీలక రేట్లను మార్చలేదు. 
 
 ఐఐపీని పునఃసమీక్షించాలి ..
 ఇటీవల పారిశ్రామికోత్పత్తి సూచీ (ఐఐపీ) గణాంకాలను సవరించడంపై స్పందిస్తూ.. కొన్ని గణాంకాల లెక్కింపు తీరును పునఃసమీక్షించాల్సిన అవసరం ఉందని రంగరాజన్ చెప్పారు. ఇలాంటి వాటిలో ఐఐపీ కూడా ఉందని, దీన్ని మరింత జాగ్రత్తగా పరిశీలించాల్సిన అవసరం ఉందని తెలిపారు. ఇందుకోసం ఒక కమిటీని కూడా ఏర్పాటు చేసినట్లు రంగరాజన్ వివరించారు. కొత్తగా కొన్ని కమోడిటీలు కూడా వచ్చిన నేపథ్యంలో వెయిటేజీలను మార్చాల్సిన అవసరం ఉంటుందన్నారు.

మరిన్ని వార్తలు