జియో ‘మాన్‌సూన్‌ హంగామా’ ఆఫర్‌పై క్లారిటీ

7 Jul, 2018 12:45 IST|Sakshi
జియో ఫోన్‌ (ఫైల్‌ ఫోటో)

సాక్షి, హైదరాబాద్ : రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ గురువారం ముంబైలో జరిగిన కంపెనీ 41 వార్షిక సమావేశంలో జియోఫోన్ 'మాన్‌సూన్ హంగామా' ఆఫర్‌ను ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ ఆఫర్ కింద వినియోగదారులు తమ వద్ద ఉన్న ఏదైనా పాత ఫీచర్ ఫోన్ ఇచ్చి కొత్తగా జియో ఫోన్‌ని కేవలం 501 రూపాయలకే పొందవచ్చని ముఖేష్‌ అంబానీ తెలిపారు. అయితే అదే సమయంలో జియోఫోన్‌ 2ను కూడా రిలయన్స్‌ ఆవిష్కరించింది. దీంతో వినియోగదారులందరూ ఈ ఆఫర్‌ జియోఫోన్‌ 2పై అనుకున్నారు. కానీ మాన్‌సూన్‌ హంగామా ఆఫర్‌ ప్రస్తుతం మార్కెట్‌లో లభ్యమవుతున్న జియోఫోన్‌పై అని కంపెనీ క్లారిటీ ఇచ్చింది.

ఏదైనా పాత ఫీచర్‌ ఫోన్‌ను ఇచ్చి రూ.501 చెల్లిస్తే జియోఫోన్‌(ప్రస్తుతం మార్కెట్లో ఉన్నది) కొనుగోలు చేయవచ్చని జియో ప్రతినిధులు ప్రకటించారు. ఈ ఆఫర్ జులై 21 న అందుబాటులోకి రానుందని తెలిపారు. దీంతో జియోఫోన్‌పై ఏర్పడిన గందరగోళం వీడింది. జియోఫోన్‌ ‘మాన్‌సూన్‌ హంగామా’ ఆఫర్‌పై గందరగోళం ఏర్పడటంతో, కొంతమంది వినియోగదారులు జియో స్టోర్లలో ప్రతినిధులను ఆరా తీశారు కూడా.  ఆగస్టు 15 నుంచి ప్రస్తుతమున్న జియోఫోన్‌లోనూ వాట్సాప్‌, ఫేస్‌బుక్‌, యూట్యూబ్‌లు వినియోగదారులకు అందుబాటులోకి వస్తాయని కంపెనీ ప్రకటించింది. కాగా, కంపెనీ కొత్తగా ప్రకటించిన జియోఫోన్‌2 ఆగస్టు 15 నుంచి మార్కెట్లోకి రానుంది. ప్రారంభ ఆఫర్‌ కింద దీనిని రూ.2,999కే విక్రయించనున్నారు.

మరిన్ని వార్తలు