మళ్లీ రిలయన్స్ కు ఇరాన్ చమురు!

19 Feb, 2016 01:09 IST|Sakshi
మళ్లీ రిలయన్స్ కు ఇరాన్ చమురు!

న్యూఢిల్లీ: దాదాపు అయిదేళ్ల విరామం తర్వాత రిలయన్స్ ఇండస్ట్రీస్ మళ్లీ ఇరాన్ నుంచి ముడిచమురు కొనుగోలు చేయనుంది. గుజరాత్‌లోని జామ్‌నగర్ రిఫైనరీ కోసం వచ్చే నెల నుంచి కొనుగోళ్లు మొదలుపెట్టవచ్చని సంబంధిత వర్గాలు తెలిపాయి. గతంలో మాదిరిగానే ఈ పరిమాణం ఏటా 5 మిలియన్ టన్నుల స్థాయిలో ఉండొచ్చని అంచనా. అణ్వాయుధాల తయారీ అంశానికి సంబంధించి ఇరాన్‌పై ఆంక్షల దరిమిలా 2009 నుంచే అక్కడికి పెట్రోల్ ఎగుమతిని రిలయన్స్ నిలిపివేసింది. ఆ తర్వాత 2010 ఫిబ్రవరి నుంచి ముడిచమురు కొనుగోళ్లు కూడా ఆపేసింది. అమెరికాలో షేల్ గ్యాస్ ప్రాజెక్టులున్న రిలయన్స్ ఇండస్ట్రీస్.. తమపైనా ఆంక్షలు విధించవచ్చన్న భయాల కారణంగా ఇరాన్‌తో వ్యాపార సంబంధాలను పక్కన పెట్టింది.

అయితే, ప్రస్తుతం ఇరాన్‌పై ఆంక్షలు తొలగిపోవడంతో మళ్లీ వ్యాపార సంబంధాలను పునరుద్ధరించుకోవాలని యోచి స్తున్నట్లు సమాచారం. ఇందుకోసం ట్రేడర్లతో కాకుండా నేరుగా నేషనల్ ఇరానియన్ ఆయిల్ కంపెనీతో చర్చలు జరుపుతోందని సంబంధిత వర్గాలు తెలిపాయి. అయితే, దీనిపై వ్యాఖ్యానించేందుకు రిలయన్స్ ప్రతినిధి నిరాకరిం చారు. అటు ప్రభుత్వ రంగ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ కూడా ఇరాన్ నుంచి చమురు కొనుగోలు చేయాలని భావిస్తోంది.

మరిన్ని వార్తలు