ఐపీవోకు ఫెడ్‌ఫినా, ఇరెడా

14 Nov, 2023 07:53 IST|Sakshi

న్యూఢిల్లీ: స్టాక్‌ ఎక్ఛేంజీలలో లిస్టయ్యేందుకు వీలుగా జులై–సెప్టెంబర్‌ మధ్య కాలంలో ఐఆర్‌ఈడీఏ(ఇరెడా)సహా.. ఫెడ్‌ఫినా, ఇప్యాక్‌ డ్యురబుల్, సూరజ్‌ ఎస్టేట్‌ డెవలపర్స్‌ సెబీకి ముసాయిదా ప్రాస్పెక్టస్‌లను దాఖలు చేశాయి. వీటికి సెబీ అక్టోబర్‌ 30– నవంబర్‌ 10 మధ్య ఆమోదముద్ర వేసింది. ఐపీవో ద్వారా కంపెనీలు స్టాక్‌ ఎక్సే్ఛంజీలలో లిస్టయ్యేందుకు సెబీ నుంచి అనుమతులు పొందవలసిన సంగతి తెలిసిందే.  

ఫెడ్‌బ్యాంక్‌ ఫైనాన్షియల్‌ 
ప్రయివేట్‌ రంగ సంస్థ ఫెడరల్‌ బ్యాంక్‌ ప్రమోట్‌ చేసిన ఫెడ్‌ఫినా ఐపీవోలో భాగంగా రూ. 750 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. అంతేకాకుండా మరో 7.03 కోట్ల షేర్లను ప్రమోటర్‌ సంస్థ ఫెడరల్‌ బ్యాంక్, ప్రస్తుత వాటాదారు ట్రూ నార్త్‌ ఫండ్‌ వీఐ ఎల్‌ఎల్‌పీ విక్రయానికి ఉంచనున్నాయి. ప్రాస్పెక్టస్‌ ప్రకారం ఫెడరల్‌ బ్యాంక్‌ 1.65 కోట్లు, ట్రూ నార్త్‌ 5.38 కోట్లు చొప్పున షేర్లు ఆఫర్‌ చేస్తున్నాయి. కాగా.. ఈక్విటీ జారీ నిధులను భవిష్యత్‌ అవసరాలరీత్యా టైర్‌–1 మూలధన పటిష్టతకు ఫెడ్‌ఫినా వినియోగించనుంది.  
ఇండియన్‌ రెనెవబుల్‌ ఎనర్జీ 
ఐపీవోలో భాగంగా ప్రభుత్వ రంగ సంస్థ ఇండియన్‌ రెనెవబుల్‌ ఎనర్జీ 40.31 కోట్ల ఈక్విటీ షేర్లను తాజాగా జారీ చేయనుంది. వీటికి జతగా మరో 26.88 కోట్ల షేర్లను కంపెనీ ప్రమోటర్‌.. కేంద్ర పునరుత్పాదక ఇంధన శాఖ విక్రయానికి ఉంచనుంది. కాగా.. ఈక్విటీ జారీ నిధులను కంపెనీ భవిష్యత్‌ పెట్టుబడి అవసరాలరీత్యా మూలధన పటిష్టతకు వినియోగించనుంది.  

ఇప్యాక్‌ డ్యురబుల్‌ 
రూమ్‌ ఎయిర్‌ కండిషనర్ల ఔట్‌సోర్స్‌డ్‌ డిజైన్‌ తయారీ సంస్థ ఇప్యాక్‌ డ్యురబుల్‌ ఐపీవోకింద రూ. 400 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. అంతేకాకుండా మరో 1.3 కోట్ల షేర్లను సైతం ప్రమోటర్లు, ప్రమోటర్‌ గ్రూప్‌ సభ్యులు విక్రయానికి ఉంచనున్నారు. ఈక్విటీ జారీ నిధులను పెట్టుబడులు, తయారీ యూనిట్ల ఏర్పాటు, రుణ చెల్లింపులు, సాధారణ కార్పొరేట్‌ అవసరాలకు 
వినియోగించనుంది. 

సూరజ్‌ ఎస్టేట్‌ డెవలపర్స్‌ 
పబ్లిక్‌ ఇష్యూలో భాగంగా రియల్టీ రంగ కంపెనీ సూరజ్‌ ఎస్టేట్‌ డెవలపర్స్‌ రూ. 400 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. ఈ నిధులలో రూ. 285 కోట్లను కంపెనీతోపాటు అనుబంధ సంస్థలు ఎకార్డ్‌ ఎస్టేట్స్, ఐకానిక్‌ ప్రాపర్టీ డెవలపర్స్‌ రుణ చెల్లింపులకు వెచ్చించనుంది. మరో రూ. 35 కోట్లు భూముల కొనుగోలుకి వెచ్చించనుంది. మిగిలిన నిధులను సాధారణ కార్పొరేట్‌ అవసరాలకు వినియోగించనుంది.  

మరిన్ని వార్తలు