రిజిస్టర్‌ కాకపోయినా రెరా వర్తిస్తుంది

1 Dec, 2018 08:44 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రెరాలో ప్రాజెక్ట్‌లు లేదా డెవలపర్లు, ఏజెంట్ల నమోదు అనేది ఒక ఆప్షన్‌ మాత్రమే. రెరాలో నమోదు చేయనంత మాత్రాన ఆ ప్రాజెక్ట్‌ రెరా పరిధిలోకి రాదని భావించొద్దు. రెరా నిబంధనలు ఉల్లంఘిస్తే నమోదు కాకపోయినా సరే రెరా చట్టం ప్రకారం కఠిన శిక్షలు అమలు చేయవచ్చని మధ్యప్రదేశ్‌ రియల్‌ ఎస్టేట్‌ రెగ్యులేటరీ (రెరా) అథారిటీ చైర్మన్‌ ఆంటోని డీ సా తెలిపారు. ఇటీవల నగరంలో రెసిడెంట్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్స్‌ (ఆర్‌డబ్ల్యూఏ) 6వ జాతీయ సమావేశం జరిగింది.

ఇందులో భాగంగా ‘పట్టణ గృహ విభాగం– రెరా అమలు’ అనే అంశంపై చర్చ జరిగింది. ఈ సందర్భంగా  ఆయన మాట్లాడుతూ.. కన్జ్యూమర్‌ కోర్ట్‌లతో సమానంగా అప్పిలేట్‌ ట్రిబ్యునల్‌కు అధికారాలుండాలని.. ఇందుకోసం రెరా చట్టంలో మార్పులు చేయాల్సిన అవసరముందని ఆయన అభిప్రాయపడ్డారు. అప్పిలేట్‌ ట్రిబ్యునల్‌ ఆదేశాల మేరకు పెనాల్టీలు లేదా శిక్షలు అమలు చేయడంలో జిల్లా కలెక్టర్లదే బాధ్యత. దీంతో జిల్లా కలెక్టర్లకు పని ఒత్తిడి, భారం పెరిగిందని దీంతో ఆలస్యం అవుతోందని పేర్కొన్నారు. అనంతరం తమిళనాడు రెరా అప్పిలేట్‌ ట్రిబ్యునల్‌ చైర్మన్‌ జస్టిస్‌ బీ రాజసేంద్రన్‌ మాట్లాడుతూ.. ‘‘ఏ చట్టం అయినా సరే ప్రారంభంలో కొత్త ఇబ్బందులు ఎదురవుతాయి. రెరా చట్టం అమలులోనూ అంతే. గత రెండేళ్లుగా రెరా అమలులో కొంత ఇబ్బందులు ఎదురయ్యాయని’’ గుర్తు చేశారు. తమిళనాడులో చాలా ప్రాజెక్ట్స్‌లో రెరాలో నమోదుకాలేదని, సుమారు వెయ్యి మంది డెవలపర్లకు సుమోటో నోటీసులు పంపించాలని లోకల్‌ అథారిటీలను ఆదేశించామని తెలిపారు.

7వ షెడ్యూల్డ్‌లో ఆర్‌డబ్ల్యూఏను జోడించాలి
పౌర నిర్వహణ, నిధుల పంపిణీలకు రాజ్యాంగ గుర్తింపు ఇవ్వాలని రెసిడెంట్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ (ఆర్‌డబ్ల్యూఏ) డిమాండ్‌ చేసింది. ఆర్‌డబ్ల్యూఏ, అర్బన్‌ లోకల్‌ బాడీ (యూఎల్‌బీ)లను 7వ షెడ్యూల్డ్‌లో జోడిస్తేనే నిధుల పంపిణీ, నిర్వహణ సులువవుతుందని కాన్ఫిడరేషన్‌ ఆఫ్‌ రెసిడెంట్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్స్‌ ప్రెసిడెంట్‌ డాక్టర్‌ రావు వీబీజే చెలికాని అభిప్రాయపడ్డారు. దీంతో స్థానికంగా ఫిజికల్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ మాత్రమే కాకుండా సామాజిక ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ నిర్వహణలో కూడా పౌరులు భాగస్వామ్యులవుతారని తెలిపారు. ఈ కార్యక్రమంలో యునైటెడ్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ రెసిడెంట్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ జనరల్‌ సెక్రటరీ బీటీ శ్రీనివాసన్‌ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు