విశాఖ స్టీల్‌ప్లాంట్‌లో రికార్డు ఉత్పత్తి

25 May, 2017 00:45 IST|Sakshi
విశాఖ స్టీల్‌ప్లాంట్‌లో రికార్డు ఉత్పత్తి

కన్వర్టర్‌–బి లో రికార్డు హీట్ల ఉత్పత్తి  
రోజులో 24 హీట్లు; ఇది జాతీయ రికార్డు!  


ఉక్కునగరం (గాజువాక): విశాఖ స్టీల్‌ప్లాంట్‌... రికార్డు ఉత్పత్తిని సాధించింది. స్టీల్‌ప్లాంట్‌ స్టీల్‌మెల్ట్‌షాప్‌ (ఎస్‌ఎంఎస్‌–1)లో ఆధునికీకరించిన కన్వర్టర్‌–బి రికార్డు హీట్లను ఉత్పత్తి చేసింది. ప్రారంభించిన 24 గంటల్లో 24 హీట్లు (ఒక హీట్‌ సుమారు 150 టన్నులకు సమానం) సాధించి మరో జాతీయ రికార్డును నమోదు చేసింది. స్టీల్‌ప్లాంట్‌ 7.3 మిలియన్‌ టన్నుల సామర్థ్యం పెంపులో భాగంగా సుమారు రూ.400 కోట్ల వ్యయంతో ఎస్‌ఎంఎస్‌–1లోని  3 కన్వర్టర్ల ఆధునికీకరణ పనులు ప్రారంభించారు. కన్వర్టర్‌–ఎ ఆధునికీకరణ పనులు గతేడాది మార్చిలో పూర్తయి ఉత్పత్తి మొదలయింది.

అప్పుడు కొత్త సాంకేతిక పరిజ్ఞానంపై అవగాహన లేమి వల్ల, సాంకేతిక పరిజ్ఞానంలో సమస్యల వల్ల మొదటి 24 గంటల్లో 4 హీట్లే సాధించగలిగారు. గతేడాది జూన్‌లో ప్రారంభించిన కన్వర్టర్‌–సి ఆధునికీకరణ పనులు అక్టోబర్‌లో పూర్తయి ఉత్పత్తి ఆరంభించారు. అది మొదటి 24 గంటల్లో 19 హీట్లు ఉత్పత్తి చేసి జాతీయ రికార్డుగా రూర్కెలా ఉత్పత్తి 11 హీట్లను అధిగమించింది. ఈ జనవరిలో మొదలుపెట్టిన కన్వర్టర్‌–బి ఆధునికీకరణ పనులు 145 రోజులు నిర్దేశించగా 127 రోజులకే పూర్తి చేశారు. దీన్ని ప్రారంభించిన 24 గంటల్లో 24 హీట్లు సాధించి మరో జాతీయ రికార్డును నమోదు చేసింది. ఇది అంతర్జాతీయ రికార్డుగా కూడా అధికారులు భావిస్తున్నారు.

మరిన్ని వార్తలు