తలనొప్పిగా మారిన కోటి రూపాయల రివార్డు స్కీమ్‌

9 Jun, 2018 11:46 IST|Sakshi

న్యూఢిల్లీ : నల్లధనం వెలికితీత కోసం ఆదాయపు పన్ను శాఖ ఇటీవల ప్రకటించిన కోటి రూపాయల రివార్డు స్కీమ్‌ తలనొప్పిగా మారింది. ఈ స్కీమ్‌ ప్రకటించిన దగ్గర్నుంచి ఐటీ డిపార్ట్‌మెంట్‌ ఫోన్లతో మారుమోగిపోతోంది. అంతేకాక కుప్పలుతెప్పలుగా ఈ-మెయిల్స్‌, కొరియర్స్‌ వచ్చి పడుతున్నాయి. ఈ స్కీమ్‌ ప్రకటించిన తొలి రోజు నుంచి అంటే జూన్‌ 1 నుంచి ఇన్‌ఫార్మర్ల దగ్గర్నుంచి భారీగా ఫిర్యాదులు వస్తూ ఉన్నాయని డిపార్ట్‌మెంట్‌కు చెందిన కమిషనర్‌ స్థాయి అధికారులు చెప్పారు. గత వారమే ఐటీ డిపార్ట్‌మెంట్‌, ఇన్‌ఫార్మర్లకు ఇచ్చే రివార్డు స్కీమ్‌ను సమీక్షించింది. దీని కింద బినామి లావాదేవీ లేదా ఆస్తికి సంబంధించి ఆదాయపన్ను విభాగానికి ఏదైనా నిర్దిష్ట సమాచారాన్ని వెల్లడిస్తే, పన్ను సమాచార వ్యవస్థ, వారికి  కోటి రూపాయల విలువైన రివార్డు అందజేస్తుంది. 

అదేవిదంగా విదేశాలలో ఉన్న నల్లధనం గురించి సమాచారం అందించిన వారికి సుమారు రూ.5 కోట్ల దాక నజరానా అందిస్తారు. అలాగే, సమాచారం అందజేసిన వ్యక్తికి సంబంధించిన వివరాలు అత్యంత గోప్యంగ ఉంచుతామని పన్ను శాఖ తెలిపింది. దీంతో వారంలోనే ఈ రివార్డుకు సంబంధించి 500 కాల్స్‌ పైగా వచ్చాయని సీబీడీటీ అధికారులు చెప్పారు. వీటిలో అవసరం లేని కాల్స్‌, కొరియర్స్‌ కూడా వస్తున్నాయని పేర్కొంది. ఈ-మెయిల్స్‌ను తనిఖీ చేసిన అనంతరం, సంబంధిత విచారణ విభాగానికి ఫిర్యాదులను ఫార్వర్డ్‌ చేస్తున్నామని మరో అధికారి చెప్పారు. కొన్ని ఫిర్యాదులు ఏకంగా 500 పేజీలకు పైగా ఉంటున్నాయని, వాటిని తాము కోర్టుకు సమర్పిస్తున్నామని తెలిపారు. ఇది ఐటీ డిపార్ట్‌మెంట్‌కు తలనొప్పిగా ఉన్నప్పటికీ, దీనికి వస్తున్న స్పందన అనూహ్యంగా ఉందని పేర్కొన్నారు. 

మరిన్ని వార్తలు