భారత్‌లో రూ. 6,400 కోట్ల పెట్టుబడులు

1 Aug, 2015 00:54 IST|Sakshi
భారత్‌లో రూ. 6,400 కోట్ల పెట్టుబడులు

 ఉబెర్ ఇండియా ప్రెసిడెంట్ అమిత్ జైన్
 
 న్యూఢిల్లీ : ట్యాక్సీ సేవల సంస్థ ఉబెర్ భారత్‌లో కార్యకలాపాలు భారీ ఎత్తున విస్తరించడానికి ప్రణాళికలు వేస్తోంది. ఇందుకోసం వచ్చే 6-9 నెలల వ్యవధిలో భారత్‌లో దాదాపు 1 బిలియన్ డాలర్లు (సుమారు రూ.6,400 కోట్లు) ఇన్వెస్ట్ చేయనున్నట్లు ఉబె ర్ ఇండియా ప్రెసిడెంట్ అమిత్ జైన్ చెప్పారు. ఒకవైపు వివిధ కారణాలతో నిషేధాలు విధించడం వంటి వివాదాలు, మరోవైపు ఓలా వంటి స్థానిక సంస్థల నుంచి తీవ్రమైన పోటీ ఎదురవుతున్న నేపథ్యంలో ఉబెర్ భారీ పెట్టుబడి ప్రణాళికలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. తమ ప్రాధాన్య మార్కెట్లలో భారత్ కూడా ఒకటని, అందుకోసమే పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టనున్నామని ఆయన తెలియజేశారు.

కార్యకలాపాలు మెరుగుపర్చుకోవడానికి, మరిన్ని నగరాలకు విస్తరించడానికి ఈ నిధులు వినియోగిస్తామన్నారు. ఈ ఇన్వెస్ట్‌మెంట్‌తో రాబోయే ఆరు-తొమ్మిది నెలల్లో రోజుకి 10 లక్షల పైగా ట్రిప్‌ల స్థాయిని సాధించగలమని అంచనా వేస్తున్నట్లు అమిత్ జైన్ తెలిపారు. అమెరికా తర్వాత తమకు అతి పెద్ద మార్కెట్‌గా భారత్ నిలుస్తోందన్నారు. వచ్చే ఐదేళ్లలో హైదరాబాద్‌లో సుమారు 50 మిలియన్ డాలర్ల పెట్టుబడితో అంతర్జాతీయ కార్యాలయం ప్రారంభించనున్నట్లు ఉబెర్ ఇటీవలే ప్రకటించింది. అంతర్జాతీయ కార్యకలాపాల్లో తొలిసారిగా హైదరాబాద్‌లో నగదు చెల్లింపులను కూడా అనుమతించాలని నిర్ణయం తీసుకుంది.

మరిన్ని వార్తలు