రూపాయి రికవరీ బాట 

25 Oct, 2018 01:14 IST|Sakshi

డాలర్‌తో 41 పైసలు బలోపేతం

3 వారాల గరిష్టం 73.16కు చేరిక  

ముంబై: డాలర్‌తో రూపాయి మారకం విలువ మూడు వారాల గరిష్ట స్థాయికి చేరుకుంది. బుధవారం ఫారెక్స్‌ మార్కెట్లో డాలర్‌తో 41 పైసలు లాభపడి 73.16 వద్ద క్లోజయింది. ఇంట్రాడేలో 73.09 వరకు కూడా రికవరీ అయింది. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు చల్లబడడం రూపాయి విలువ రికవరీకి కారణమైనట్టు ఫారెక్స్‌ డీలర్లు పేర్కొన్నారు. ఇరాన్‌పై నవంబర్‌ 4 నుంచి అమెరికా ఆంక్షలు అమల్లోకి రానుండడం కారణంగా, చమురు సరఫరాలో లోటు ఏర్పడితే దాన్ని తాము భర్తీ చేస్తామని సౌదీ అరేబియా ప్రకటించడం ధరలు తగ్గటానికి కారణమైంది.

ఈ ప్రకటనతో బ్రెంట్‌ చమురు బ్యారెల్‌ 76 డాలర్లకు దిగొచ్చింది. చమురు ధరలు తగ్గడంతో విదేశీ నిధులు తరలిపోవడంపై ఆందోళనలు కొంత తగ్గాయి. అదే సమయంలో బ్యాంకులు, ఆయిల్‌ కంపెనీలు డాలర్లను విక్రయించడం కూడా రూపాయి బలపడడానికి దారితీసింది. మంగళవారం రూపా యి 73.57 వద్ద క్లోజయిన విషయం తెలిసిందే. 

మరిన్ని వార్తలు