ఇండిగో నష్టాలు రూ.652 కోట్లు  లిస్టయిన తర్వాత తొలి నష్టాలు  | Sakshi
Sakshi News home page

ఇండిగో నష్టాలు రూ.652 కోట్లు  లిస్టయిన తర్వాత తొలి నష్టాలు 

Published Thu, Oct 25 2018 1:17 AM

Q2 results: IndiGo posts first loss since going public - Sakshi

న్యూఢిల్లీ: విమానయాన సంస్థ,  ఇంటర్‌గ్లోబ్‌ ఏవియేషన్‌ (ఇండిగో) కంపెనీకి ఈ ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్‌ క్వార్టర్లో రూ.652 కోట్ల నికర నష్టాలొచ్చాయి. వ్యయాలు అధికం కావడం, పోటీ తీవ్రమవడం, డాలర్‌తో రూపాయి మారకం భారీగా క్షీణించడం తదితర కారణాల వల్ల ఈ స్థాయిలో నికర నష్టాలొచ్చాయని ఇంటర్‌గ్లోబ్‌ ఏవియేషన్‌ తెలిపింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్లో రూ.552 కోట్ల నికర లాభం వచ్చిందని ఇండిగో వ్యవస్థాపకుల్లో ఒకరు, తాత్కాలిక సీఈఓగా కూడా వ్యవహరిస్తున్న రాహుల్‌ భాటియా తెలిపారు.  

కాగా ఈ కంపెనీ స్టాక్‌మార్కెట్లో లిస్టయినప్పటినుంచి (2015, నవంబర్‌) చూస్తే, నష్టాలు రావడం ఇదే తొలిసారి. గత క్యూ2లో రూ.5,506 కోట్లుగా ఉన్న మొత్తం ఆదాయం ఈ క్యూ2లో 18 శాతం పెరిగి రూ.6,514 కోట్లకు చేరుకుంది. మొత్తం వ్యయాలు 58 శాతం పెరిగి రూ.7,502 కోట్లకు చేరాయి. ఇంధన వ్యయాలు రూ.1,647 కోట్ల నుంచి ఏకంగా 84 శాతం ఎగసి రూ.3,036 కోట్లకు చేరుకున్నట్లు భాటియా తెలియజేశారు. ఎబిటా రూ.1,581 కోట్ల నుంచి 86 శాతం తగ్గి రూ.220 కోట్లకు తగ్గింది. ఎబిటా మార్జిన్‌ 29.9 శాతం నుంచి 3.6 శాతానికి పడిపోయింది. 

Advertisement
Advertisement